కలం, మహబూబ్‌నగర్ బ్యూరో : ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని జిల్లా సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి డి. ఇందిరా (District Judge Indira) అన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్‌లోని (Mahabubnagar) ప్రభుత్వ అంధుల ఆశ్రమ పాఠశాలలో పాలమూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూజలు నిర్వహించి, జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం పాలమూరు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు లయన్ బాబుల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో డి. ఇందిరా మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. ఉపాధ్యాయులను ప్రతి ఒక్కరూ సదా గౌరవించుకోవాలని కోరారు.
అనంతరం విద్యారంగంలో విశేష సేవలు అందించిన ఉత్తమ ఉపాధ్యాయులు అశ్విని చంద్రశేఖర్, వెంకట్ రెడ్డి, అశోక్ కుమార్, శ్రీలేఖ, సుజాత, సౌమ్య, సంధ్యారాణి, పండుగ ఆంజనేయులను ఘనంగా సత్కరించి పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో లయన్స్ ఇంటర్నేషనల్ ఫస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ డాక్టర్ అంబటి నటరాజ్, క్లబ్ అధ్యక్షుడు బాబుల్ రెడ్డి, కార్యదర్శి ప్రవీణ్ కుమార్, కోశాధికారి యతిరాజచారి, పీఆర్వో అశ్విని చంద్రశేఖర్, ప్రోగ్రాం చైర్మన్ ప్రతాప్ రెడ్డి, కో-కన్వీనర్ శ్రీహరి, వీఎస్‌ఆర్‌కే ప్రసాద్, సుబ్రహ్మణ్యం, అంధుల ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపాల్ జ్యోతి సాగర్, విశ్రాంత ప్రిన్సిపాల్ రాములు తదితరులు పాల్గొన్నారు.

