భూ భారతితోనే అర్హులైన రైతులందరికీ న్యాయం: ఎమ్మెల్యే

కలం, దేవరకొండ : గత ప్రభుత్వ హయాంలో ధరణి లోపాల వల్ల నష్టపోయిన నిజమైన అర్హులైన రైతులకు భూ భారతి ద్వారా సమగ్ర సర్వే నిర్వహించి, నిబంధనల ప్రకారం పట్టాలు అందజేస్తామని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ ( MLA Balu Naik ) స్పష్టం చేశారు. నల్లగొండ జిల్లా చందంపేట మండలంలోని చీత్రియాల, పెద్దమూల, నల్లచెలమూల, బుడ్డోని తండా, కాకునూటి తండా గ్రామాల ప్రజలతో ఆయన ప్రజా ముఖాముఖి సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలునాయక్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో ధరణి పోర్టల్‌లో దొర్లిన తప్పుల కారణంగా అనేకమంది రైతులకు చెందిన భూములు ఆన్‌లైన్‌లో నమోదు కాక, పట్టాలు రాక తీవ్ర అవస్థలు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి కార్యక్రమం ద్వారా ప్రతి ఎకరా భూమిని పారదర్శకంగా సర్వే చేసి, బాధిత రైతులకు హక్కు పత్రాలు అందిస్తామని హామీ ఇచ్చారు. భూ సమస్యల పరిష్కారంలో రైతన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని పేర్కొన్నారు.

వ్యవసాయ రంగానికి సాగునీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. నాగార్జునసాగర్ నుంచి గాజుబేడా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఈ ప్రాంత రైతులకు సాగునీరు అందించేందుకు అధికారులతో సమన్వయం చేసుకుని తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ప్రాంతంలో నిలిచిపోయిన రహదారి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజల రవాణా కష్టాలను తీరుస్తామని మాటిచ్చారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కిన్నెర హరికృష్ణ, చీత్రియాల మాజీ సర్పంచ్ రంగయ్య, బుడ్డోనితండా మాజీ సర్పంచ్ బాలు నాయక్, నాయకులు మున్నయ్య, వెంకటయ్య, నాగేష్, లక్ష్మయ్య, వెంకటయ్య, లింగాల పెంటయ్య, ముత్యామయ్య, ఉప సర్పంచ్ తుల్చా, భర్మా, ఆయా గ్రామాల ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>