ఖమ్మం సాగునీటికి సీతమ్మ సాగర్ కీలకం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

కలం, ఖమ్మం బ్యూరో : ఉమ్మడి ఖమ్మం (Khammam) జిల్లా పరిధిలోని సీతారామ ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో నీరు అందించేందుకు కీలకమైన ‘సీతమ్మ సాగర్ బ్యారేజీ’ (Sitamma Sagar Barrage) నిర్మాణాన్ని వేగవంతం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుకు ప్రధాన అడ్డంకిగా ఉన్న లీగల్ సమస్యలు, ఎన్జీటీ క్లియరెన్స్ అంశాలను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) తెలిపారు.

హైదరాబాద్ ఎర్రమంజిల్‌లోని జలసౌధలో సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఆయన, అడ్వకేట్ జనరల్‌తో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ న్యాయపరమైన అడ్డంకులను తొలగించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. సీతమ్మ సాగర్ బ్యారేజీ పూర్తయితేనే సీతారామ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరు అందుతుందని స్పష్టం చేశారు. గిరిజన నియోజకవర్గాల అభివృద్ధికి సాగునీటి వసతులు అత్యంత కీలకమని పేర్కొన్నారు.

జిల్లాలో కొనసాగుతున్న ప్రాజెక్టులు, కొత్త ప్రతిపాదనలను సమగ్ర నివేదికల రూపంలో సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఆ నివేదికలను ప్రాధాన్యత క్రమంలో పరిశీలించి, ఆర్థిక శాఖ ద్వారా నిధులను విడుదల చేసి బిల్లులు క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారు. తక్కువ వ్యయంతో ఎక్కువ ఎకరాలను సాగులోకి తీసుకురాగల చిన్న తరహా ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. అలాగే భూసేకరణ, ఆర్ & ఆర్ ప్యాకేజీలకు సంబంధించిన పెండింగ్ బిల్లుల చెల్లింపులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. సాగునీటి శాఖ అధికారులు జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ పెండింగ్ అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని, ప్రభుత్వం కూడా అవసరమైన నిధులను విడుదల చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>