కలం, వెబ్ డెస్క్: ఏపీ డీఎస్సీ (AP DSC)పై వస్తున్న పలు ఆరోపణలసై రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్ (Kona Sasidhar) స్పందించారు. డీఎస్సీ నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరగలేదని ఆయన పేర్కొన్నారు. తాజాగా డీఎస్సీపై వస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. డీఎస్సీ ప్రశ్నా పత్రాల్లో 42 వేల ప్రశ్నా పత్రాలు రూపొందించినట్లు తెలిపారు. ఏపీలో డీఎస్సీ నిర్వహించిన టీసీఎస్ ఐయాన్ ప్లాట్ ఫాం 20 రాష్ట్రాల్లో రకరకాల పరీక్షలు చేపడుతుందన్నారు. అన్ని పరీక్షలకు ఒకే సాఫ్ట్‌వేర్ వాడుతున్నట్లు చెప్పారు. పరీక్ష పత్రాల అప్‌లోడ్ ప్రక్రియలో కేవలం ఇద్దరు ఎస్‌సీఈఆర్టీ శాశ్వత ఉద్యోగులు మాత్రమే భాగస్వాములు అవుతారని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఎలాంటి అవకాశం ఉండదని స్పష్టం చేశారు.
సిస్టమ్స్‌ను ప్రతి రోజు పాస్ వర్డ్స్ మార్చడం జరుగుతుందని చెప్పారు. ఔటో సోర్సింగ్ వాళ్లు ప్రశ్నా పత్రాలు అప్‌లోడ్ చేయడం కానీ, వాటి యాక్సెస్ పొందే అవకాశం గానీ అస్సలు లేదన్నారు. ప్రశ్నా పత్రాలు లీక్ అయ్యే అవకాశమే లేదని ఆయన స్పష్టం చేశారు. రిజర్వేషన్ విధానాన్ని అర్థం చేసుకోలేక కొందరు విమర్శలు చేస్తున్నారన్నారు. 1:1 నిష్పత్తిలో ఎంపికైనంత మాత్రాన ఉద్యోగం వచ్చినట్లు కాదని, ఈ విషయాన్ని నోటిఫికేషన్‌లో కూడా స్పష్టంగా ముందే చెప్పామని కోన శశిధర్ వెల్లడించారు.

