Mobile Popup Ad
Mobile Popup Ad

దక్షిణాదికి అన్యాయం జరగదు: సీట్ల పెంపుపై కిషన్ రెడ్డి కొత్త ఫార్ములా

కలం, వెబ్ డెస్క్​ : నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగకుండా, ప్రజల సెంటిమెంటును గౌరవిస్తూ కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మకమైన ‘50 శాతం పెంపు’ ఫార్ములాను ముందుకు తెచ్చిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి (Kishan Reddy) తెలిపారు. శుక్రవారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ అంశాలపై విపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు.

ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు సీట్లు కోల్పోతాయనే ఆందోళన అవసరం లేదని, మోదీ ప్రభుత్వం రూపొందించిన కొత్త విధానం వల్ల అన్ని ప్రాంతాలకు సమాన నిష్పత్తిలో లబ్ధి చేకూరుతుందని ఆయన భరోసా ఇచ్చారు. ఈ విప్లవాత్మక నిర్ణయం వల్ల దక్షిణాదికి మేలు జరుగుతుంటే, విపక్షాలు మాత్రం తమ రాజకీయ ఉనికి కోల్పోతామనే భయంతో అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. ముఖ్యంగా కుటుంబ పార్టీలు, తమ వారసత్వ ప్రాబల్యం ఎక్కడ తగ్గిపోతుందోననే ఆందోళనతో కొత్త నాయకత్వం రాకుండా అడ్డుకుంటున్నాయని విమర్శించారు.

మజ్లిస్ పార్టీ మొదటి నుంచీ మహిళా సాధికారతకు వ్యతిరేకమని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. పాతబస్తీలో మహిళా జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ, వారికి రాజకీయ అవకాశాలు దక్కకూడదనే కుట్రతోనే ఒవైసీ సోదరులు మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన హైబ్రిడ్ ఫార్ములాను మజ్లిస్ తయారు చేసినట్లుగా ఉందని, కేవలం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే సీట్లు పెంచాలనే ఆలోచన మిగిలిన జిల్లాల అభివృద్ధిని విస్మరించడమేనని ఆయన అన్నారు.

గతంలో ఏపీ విభజన చట్టం సమయంలో సీట్ల పెంపునకు ఏ ఫార్ములా వాడారో కాంగ్రెస్ నేతలు చెప్పాలని ఆయన సవాల్ విసిరారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో సవరణల కోసం కేంద్ర ప్రభుత్వం తాజాగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిందని, ఇది చట్టబద్ధమైన ప్రక్రియ అని వివరించారు. దేశాభివృద్ధికి, మహిళా ప్రాతినిధ్యానికి అడ్డంకిగా మారుతున్న విపక్షాలు చరిత్రహీనులుగా మిగిలిపోతారని అన్నారు. మోదీ ప్రభుత్వం తెచ్చిన ఈ కొత్త ఫార్ములాపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని కిషన్ రెడ్డి (Kishan Reddy) తెలిపారు.

Read Also:  మహిళా బిల్లుపై మోడీ భావోద్వేగ అప్పీల్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>