Mobile Popup Ad
Mobile Popup Ad

కాంగ్రెస్ ఎంపీ సింఘ్వీ రోజువారీ సంపాదన ఎంతో తెలుసా?

కలం, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ తరఫున రాజ్యసభకు ఎన్నికైన సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి (Abhishek Singhvi) రోజువారీ సంపాదన ఎంతో ఊహించగలరా?.. నెలకు ఎంత ఆదాయం వస్తుందో అంచనాకు అందుతుందా?.. ఇప్పటివరకు ఆయన సంపాదించిన ఆస్తుల విలువ ఎంతో ఎప్పుడైనా విన్నారా?.. అధికారికంగా లెక్కల్లో వెల్లడించిన వివరాలను చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఇక లెక్కల్లోకి రాకుండా ఉన్న ఆస్తుల గురించి తెలిసే అవకాశమే లేదు. కానీ ఆయన రోజువారీ సంపాదన కోటి రూపాయలకు పైగానే. ప్రతి ఏటా రూ. 300 కోట్లకంటే ఎక్కువే ఆదాయం ఉన్నట్లు స్వయంగా ఆయనే వెల్లడించారు. ఇక ఆస్తుల గురించి చెప్పుకుంటే ఎనిమిది కిలోల బంగారం, 100 కిలోల వెండి, రూ. 25 కోట్ల విలువైన పెయింటింగ్స్, బంగళాలు.. ఇలా మొత్తం కలిపి రూ. 2,558 కోట్లకు పైగానే. ఎలాంటి అప్పుల్లేవని పేర్కొన్నారు. రాజ్యసభ ఎన్నికల సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో ఈ అంశాలను ఆయన తెలిపారు.

ఐదేండ్లలో ఆదాయం డబుల్ :

ఐదేండ్లలో ఆయన ఆదాయం రెండు రెట్లకంటే ఎక్కువే పెరిగింది. ఇన్‌కమ్ టాక్స్ రిటన్స్ లో ఆయన గడచిన ఐదేండ్లలో ఎంత వార్షికాదాయం వచ్చిందీ వివరించారు. 2020-21 ఫైనాన్షియల్ ఇయర్‌లో రూ. 158 కోట్ల వార్షికాదాయం ఉంటే ఆ తర్వాతి సంవత్సరం అది రూ. 291 కోట్లకు పెరిగింది. చివరకు 2024-25 ఆర్థిక సంవత్సరంలో అది రూ. 374 కోట్లకు పెరిగినట్లు ఆదాయపు పన్ను శాఖకు తెలిపారు. ఈ ప్రకారం సగటున ఆయన రోజువారీ ఆదాయం కోటి రూపాయలకు పైగానే. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా ఉన్న ఆయన అర కిలో బంగారం ఆభరణాలు ఉంటే ఆయన భార్యకు ఏడున్నర కిలోల గోల్డ్ ఆర్నమెంట్స్ ఉన్నాయి. ఆయనకు 40 కిలోల వెండి వివిధ రూపాల్లో ఉంటే భార్యకు 60 కిలోలు ఉన్నట్లు వెల్లడి. ఆదాయపు పన్ను విభాగంతో కోర్టు వివాదం ఉన్న కారణంగా రూ. 20 కోట్ల మేర సెటిల్ కావాల్సి ఉన్నదని పేర్కొన్నారు.

షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ లోనే అధికం :

మొత్తం ఆస్తుల్లో సింహభాగం చరాస్తుల రూపంలో పెట్టుబడిగా ఉన్నాయి. షేర్లలో రూ. 191 కోట్లు, మ్యూచువల్ ఫండ్స్ లో రూ. 198 కోట్లు, ఏఐఎఫ్ ఫండ్స్ రూపంలో రూ. 203 కోట్లు, పీఎంఎస్ ఫండ్స్ రూపంలో రూ. 141 కోట్లు, ఆదినాధ్ ఫ్యామిలీ ట్రస్టులో రూ. 358 కోట్ల చొప్పున ఇన్వెస్ట్ మెంట్స్ ఉన్నాయి. వ్యక్తులు, సంస్థలకు ఇచ్చిన అప్పులే రూ. 354 కోట్లు ఉన్నాయి. మొత్తం రూ. 2,558 కోట్ల ఆస్తుల్లో కేవలం అభిషేక్ సింఘ్వి (Abhishek Manu Singhvi) పేరు మీద రూ. 1536 కోట్ల మేర చరాస్తులు (మూవబుల్ అసెట్స్) ఉంటే ఆయన భార్య పేరు మీద రూ. 568 కోట్లు ఉన్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>