కలం, సూర్యాపేట: ఓటు హక్కు అనేది రాజ్యాంగం కల్పించిన అత్యంత శక్తివంతమైన ప్రాథమిక హక్కు అని, సర్వేల పేరుతో అర్హులైన ఓటర్ల పేర్లను తొలగిస్తే ప్రజాస్వామ్య హక్కులను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని ప్రభుత్వ విప్, శాసనమండలి సభ్యులు బల్మూరి వెంకట్ (Venkat Balmoor) హెచ్చరించారు. గురువారం సూర్యాపేట పట్టణంలోని బాలాజీ కన్వెన్షన్ హాల్‌లో కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి, క్షేత్రస్థాయిలో ఓటర్ల హక్కుల రక్షణకు బూత్ లెవెల్ ఏజెంట్లు వెన్నుముక లాంటి వారని కొనియాడారు. ఓటర్ల జాబితా సవరణ లేదా సర్వేల పేరుతో సాగే ప్రక్రియల వల్ల గ్రామీణ ప్రాంతాల ప్రజలు, పేదలు, కార్మికులు అవసరమైన పత్రాలను సమర్పించడంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
నిరుపేదల ఓటు హక్కును కాపాడాల్సిన కనీస బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పారదర్శకంగా సాగాలని, అర్హులైన ఒక్క ఓటరు కూడా నష్టపోకుండా ఎన్నికల కమిషన్ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామం, ప్రతి వార్డులో జరిగే ఓటర్ల సర్వే ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ నిశితంగా పర్యవేక్షిస్తుందన్నారు. పత్రాల సమర్పణలో ఇబ్బందులు పడే సామాన్య ప్రజలకు కాంగ్రెస్ శ్రేణులు పూర్తి స్థాయిలో సహాయం అందిస్తాయని తెలిపారు. ఓటు హక్కును హరించే ఎలాంటి చర్యలనైనా ప్రజాస్వామ్యబద్ధంగా అడ్డుకుంటామన్నారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ ఓబీసీ నాయకులు కత్తి వెంకటస్వామి, ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, పీసీసీ ప్రధాన కార్యదర్శి చకిలం రాజేశ్వర్ రావు, మండల పార్టీ అధ్యక్షులు కోతి గోపాల్ రెడ్డి, తూముల సురేష్ రావు, ధారవత్ వీరన్న నాయక్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజద్ అలీ, స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లు, పెద్ద సంఖ్యలో బూత్ లెవల్ ఏజెంట్లు, కాంగ్రెస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

