వారధి సొసైటీ వ్యవహారంపై ఏఐవైఎఫ్ పోరుబాట

కలం, కరీంనగర్ : కరీంనగర్ ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో వారధి సొసైటీ(Vaaradhi Society) ముసుగులో ఉద్యోగ నియామకాల పేరుతో లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై సీబీసీఐడీతో సమగ్ర విచారణ జరిపించాలని ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్రాహ్మణపల్లి యుగంధర్ డిమాండ్ చేశారు. ఉద్యోగ నియామకాల వెనుక ఉన్న అసలు వ్యవహారాలు, వారధి సొసైటీ చైర్మన్ పాత్ర, ఆర్థిక లావాదేవీలను పూర్తిస్థాయిలో పరిశీలించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాకు కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా యుగంధర్ మాట్లాడుతూ.. కరీంనగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో వివిధ కేటగిరీలకు సంబంధించి సుమారు 20 ఉద్యోగాల భర్తీకి 2026లో వారధి సొసైటీ ఆధ్వర్యంలో నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలిపారు. అయితే నోటిఫికేషన్‌లో కళాశాల పేరును ముందుంచి నియామక ప్రక్రియ చేపట్టినప్పటికీ, రిక్రూట్‌మెంట్ పూర్తయిన తర్వాత అధికారుల పేర్లను తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు. వారధి సొసైటీ చైర్మన్ తెరవెనుక ఉండి మొత్తం వ్యవహారాన్ని నడిపించారనే అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నియామకాల వెనుక అసలు పాత్రధారులు ఎవరు? నిర్ణయాలు ఎవరు తీసుకున్నారు? ఆర్థిక లావాదేవీలు ఎవరి ద్వారా జరిగాయి? అనే అంశాలపై లోతుగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

వారధి సొసైటీ ద్వారా ఆన్‌లైన్‌లో వేలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారని, ఇప్పటివరకు వారిలో ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారో సొసైటీ స్పష్టం చేయాలని ప్రశ్నించారు. ఉద్యోగాల పేరుతో లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సొసైటీ చైర్మన్ ఆర్థిక లావాదేవీలపై ప్రత్యేక దృష్టి సారించి విచారణ చేపట్టాలని కోరారు.

నోటిఫికేషన్‌లో పేర్కొన్న రిజర్వేషన్ రోస్టర్, సీనియారిటీ నిబంధనలను పాటించకుండా నియామకాలు చేపట్టారనే ఆరోపణలు ఉన్నాయని యుగంధర్ తెలిపారు. ఎంపికైన కొందరు అభ్యర్థుల విద్యార్హతల ధ్రువపత్రాల్లోని వివరాలకు, దరఖాస్తుల్లో పేర్కొన్న మార్కులకు మధ్య వ్యత్యాసాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. గతంలోనూ వారధి సొసైటీ చేపట్టిన నియామకాలపై ఆరోపణలు వచ్చాయని, ఒకే కుటుంబానికి చెందిన పలువురికి ఉద్యోగాలు కల్పించారనే విమర్శలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు.

జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి ఈ మొత్తం వ్యవహారంపై సీబీసీఐడీతో సమగ్ర విచారణ జరిపించాలని, వారధి సొసైటీ చైర్మన్ పాత్రతో పాటు ఆయనకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలను కూడా పరిశీలించాలని యుగంధర్ కోరారు. విచారణలో అక్రమాలు నిర్ధారణ అయితే బాధ్యులు ఎంతటివారైనా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, అర్హులైన నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ వినతిపత్రం సమర్పించిన వారిలో ఏఐవైఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కసి బోసుల సంతోష్ చారి, జిల్లా ఉపాధ్యక్షుడు చెంచల మురళి, నగర సహాయ కార్యదర్శి జువాజి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>