నిర్దేశిత గడువులో రీ-సర్వే పూర్తి చేయాలి: కలెక్టర్ రాజర్షి షా

కలం, ఆదిలాబాద్: జిల్లాలో భూభారతి కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న భూముల రీ-సర్వే (Bhu Bharati Land Resurvey) ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పూర్తి పారదర్శకతతో, వేగవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖ అధికారులతో రీ-సర్వే పురోగతిపై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలాల వారీగా సర్వే పనుల పురోగతి, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలు, పెండింగ్‌లో ఉన్న అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు భూ రికార్డుల్లో పారదర్శకత, కచ్చితత్వం తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం భూభారతి రీ-సర్వే కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిందన్నారు. ఈ ప్రక్రియలో ప్రతి దశను బాధ్యతాయుతంగా నిర్వహించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో భూముల కొలతలు చేపట్టే ముందు సంబంధిత రైతులకు ముందస్తు సమాచారం అందించాలని, రైతుల సమక్షంలోనే భూముల సరిహద్దులను నిర్ధారించి కొలతలు చేపట్టాలని స్పష్టం చేశారు.

సర్వే సమయంలో రైతుల అభ్యంతరాలు, సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని, ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా భూ వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం చేపడుతున్న సర్వేలో తీసుకునే జాగ్రత్తలే భవిష్యత్తులో భూ వివాదాలు తలెత్తకుండా నివారించేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు. గ్రామాల వారీగా నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత సమయంలో పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించుకోవాలని, ప్రతిరోజూ సర్వే పనుల పురోగతిని సమీక్షించాలని అధికారులకు సూచించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను ప్రాధాన్యత క్రమంలో త్వరితగతిన పరిష్కరించాలని, సర్వే సిబ్బందికి అవసరమైన సాంకేతిక పరికరాలు, ఇతర మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.

రీ-సర్వే ప్రక్రియపై రైతులు, ప్రజల్లో ఎలాంటి అపోహలు, సందేహాలు ఉన్నా వాటిని నివృత్తి చేస్తూ గ్రామస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. సర్వే పనుల్లో నిర్లక్ష్యం వహించకుండా సమన్వయంతో పనిచేసి, నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఆర్.ఎస్. చిత్రు, సబ్ కలెక్టర్ ప్రణయ్ కుమార్, ల్యాండ్ సర్వే ఏడీ ప్రభాకర్, ఏవో వర్ణ, తహసీల్దార్లు, మండల సర్వేయర్లు, రెవెన్యూ, భూ రికార్డులు, సర్వే శాఖల అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>