సమ్మక్క సాగర్‌ బ్యారేజీకి ఎన్‌ఓసీ ఇవ్వండి.. ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రికి రేవంత్‌ రెడ్డి వినతి

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలోని సాగు, తాగునీటి అవసరాలకు కీలకమైన సమ్మక్క సాగర్ (Sammakka Sagar Project) నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. అందులో భాగంగానే ప్రాజెక్టు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy).. ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌ఓసీ) జారీ చేయాలని కోరారు. దీనిపై విష్ణుదేవ్ సాయి సానుకూలంగా స్పందించి ఎన్‌ఓసీ ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

రేవంత్ రెడ్డితో పాటు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సమావేశం అయ్యారు. సమ్మక్క సాగర్ బ్యారేజీలో నీటిని నిల్వ చేసుకునేందుకు అనుమతులు ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. ఎల్‌నినో పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలో నీటి అవసరాలు పెరిగే అవకాశం ఉందని వివరించారు. ప్రాజెక్టుకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఇతర అనుమతుల మంజూరుకు కూడా సహకరించాలని వారు కోరారు.

సమ్మక్క సాగర్ ప్రాజెక్టును తొలుత కాంతనపల్లి వద్ద నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే, అక్కడ బ్యారేజీ నిర్మిస్తే 11,408 ఎకరాల భూమి ముంపునకు గురయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. దీంతో పాటు 17 ఆదివాసీ గ్రామాలు, భద్రతాపరమైన మౌలిక సదుపాయాలపై ప్రభావం పడే ప్రమాదం ఉండటంతో ముంపును తగ్గించేందుకు తుపాకులగూడెంకు మార్చారు.

ఐఐటీ ఖరగ్‌పూర్ అధ్యయనం ప్రకారం.. సమ్మక్క సాగర్ బ్యారేజీ పూర్తి స్థాయి నీటి మట్టం వద్ద ఛత్తీస్‌గఢ్‌లో సుమారు 33 ఎకరాల భూమి మాత్రమే ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. భారీ వరదల సమయంలోనూ ఈ ప్రభావిత ప్రాంతం 100 ఎకరాలకు మించదని అధ్యయనంలో వెల్లడైంది. ఈ అధ్యయనం కోసం ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కోరిన రూ.9.883 కోట్లను తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్‌లోనే చెల్లించింది. ఐఐటీ ఖరగ్‌పూర్ తన అధ్యయన నివేదికను జూలై 30న ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి సమర్పించింది.

మరోవైపు ములుగు జిల్లా తుపాకులగూడెం వద్ద సమ్మక్క సాగర్ బ్యారేజీ నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. పూర్తి స్థాయి నీటి మట్టం +83 మీటర్ల వద్ద ఈ బ్యారేజీ నిల్వ సామర్థ్యం 6.94 టీఎంసీలుగా ఉంది. కరువు ప్రభావిత, వెనుకబడిన, గిరిజన ప్రాంతాల్లో సాగు, తాగునీటి అవసరాలను తీర్చేందుకు గోదావరి జలాలను వినియోగించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం.

పరిహారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధం

ఛత్తీస్‌గఢ్‌లో భూసేకరణ, పరిహారం, పునరావాసానికి అవసరమైన నిధులను నిబంధనల ప్రకారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పష్టం చేశారు. బ్యారేజీ నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎన్‌ఓసీని త్వరగా జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. మిగిలిన అనుమతుల ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని కోరారు. ఛత్తీస్‌గఢ్ సీఎం సానుకూలంగా స్పందించి ఎన్‌ఓసీ ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇవ్వడంతో సమ్మక్క సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కీలక ముందడుగు పడినట్లయింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>