ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోండి: ఇలా త్రిపాఠి

కలం, నిజామాబాద్ బ్యూరో: తెలంగాణాలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Ila Tripathi) కోరారు. ఈ పథకం అమలు కోసం దరఖాస్తుల స్వీకరణ, ప్రజలకు అవగాహన కల్పించడం తదితర అంశాలపై మంగళవారం నిజామాబాద్ కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం గురించి విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తూ, అర్హత కలిగిన ప్రతి కుటుంబం వినియోగించుకునేలా సమన్వయంతో పని చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 19వ తేదీ నుంచి గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల వారీగా దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. ఈ మేరకు ముందస్తుగానే అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని అన్నారు. ఈ పథకం కింద రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ కల్పించబడుతుందని, కుటుంబంలో జీవనోపాధికి ప్రధానంగా ఆధారపడే వ్యక్తికి బీమా వర్తించేలా నమోదు ప్రక్రియ చేపట్టాలని సూచించారు.

కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మంది ఆదాయం ఆర్జించే వారు ఉన్నట్లయితే, బీమా వర్తించే వ్యక్తిని ఆ కుటుంబమే ఎంపిక చేసుకునే అవకాశం కల్పించాలన్నారు. కులం, మతం, ఆదాయ పరిమితులతో సంబంధం లేకుండా కుటుంబాలకు జీవిత బీమా భద్రత కల్పించడమే లక్ష్యంగా దీనిని అమలులోకి తెస్తోందని తెలిపారు. కుటుంబ పెద్ద లేదా జీవనోపాధికి ఆధారమైన వ్యక్తిని కోల్పోయిన సందర్భంలో ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా అండగా నిలవడం ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రాజాగౌడ్, భుజంగరావు, జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, సీపీఓ రతన్, ఇంచార్జి డీపీఓ నాగరాజు, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>