కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా కలెక్టర్‌గా 2024 జూన్ లో బాధ్యతలు స్వీకరించి, సుమారు 20 నెలల పాటు పరిపాలన విధులు నిర్వహించిన జితేష్.వి పాటిల్ (Jitesh V Patil) ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. వ్యవసాయ రంగంపై ప్రత్యేకంగా దృష్టి సారించి వినూత్నంగా వ్యవసాయం చేసే రైతులను ప్రోత్సహించారు.సేంద్రియ వ్యవసాయం, మునగాకు సాగు, బయోచార్ వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు.
బాతులు, కౌజు పిట్టల పెంపకం, మట్టి ఇటుకల తయారీ వంటి వినూత్న కార్యక్రమాలతో యువతకు ఉపాధి మార్గాలు చూపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందేలా కృషి చేయడంతో పాటు, తన సతీమణి శ్రద్ధ గర్భం దాల్చినప్పటి నుంచి కాన్పు వరకు పాల్వంచ ప్రభుత్వ హాస్పిటల్‌లోనే చూపించడం గమనార్హం. నీటి పరిరక్షణ కోసం జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా పూర్తి చేసినందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) చేతుల మీదుగా జల్ సంచాయి జన్ భగీదారి అవార్డును దక్కించుకున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కలెక్టర్ అంకిత్ (IAS Ankit) గురువారం సాయంత్రం 6.19 గంటలకు పదవీ బాధ్యతలు స్వీకరించారు. నిజామాబాద్(Nizamabad)లో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) గా, అంతకు ముందు ఏటూరునగరం ఐటిడిఎ పీఓగా, అంతకు ముందు నగర్ కర్నూల్‌లో అసిస్టెంట్ కలెక్టర్‌గా విధులు నిర్వహించి పరిపాలనపై పట్టు సాధించినప్పటికీ భద్రాద్రిలో తన మార్క్‌ను ఎలా చూపించబోతున్నారో అని ప్రజలు ఎదురుచూస్తున్నారు.

