గురుకుల పాఠశాలలపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

కలం, ఖమ్మం బ్యూరో : టేకులపల్లి (Tekulapalli)  మండలంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలను జిల్లా కలెక్టర్ అంకిత్ (Collector Ankit) సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా జరుగుతున్న 99 రోజుల కార్యాచరణలో సంక్షేమ వారోత్సవాల సందర్భంగా జిల్లాలోని పలు పాఠశాలలను ఆయన పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని కలెక్టర్ సమగ్రంగా పరిశీలించారు. వంటగది పరిస్థితులు, భోజనం తయారీ విధానాన్ని తనిఖీ చేసి, విద్యార్థులకు అందించే ఆహారం శుభ్రంగా, రుచికరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సరుకుల నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

పాఠశాల పరిసరాలలో పారిశుద్ధ్య పరిస్థితిని పరిశీలించిన ఆయన, విద్యార్థులకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకు ఎప్పటికప్పుడు శుభ్రత పాటించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పాఠశాలలో ఉన్న ఆర్వో ప్లాంట్‌ను కలెక్టర్ (Collector Ankit) పరిశీలించగా, గత రెండు సంవత్సరాలుగా అది వినియోగంలో లేకపోవడం గమనించారు. త్రీఫేజ్ విద్యుత్ సమస్య కారణంగా ప్లాంట్ పనిచేయడం లేదని అధికారులు వివరించారు. దీనిపై స్పందించిన కలెక్టర్, వెంటనే త్రీఫేజ్ విద్యుత్ సమస్యను పరిష్కరించి ఆర్వో ప్లాంట్‌ను వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు.

తదుపరి టేకులపల్లి మండలం నంద్యా తండాలోని ఏకలవ్య పాఠశాలను (Eklavya School) కూడా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి సదుపాయాలు, మెనూ ప్రకారం భోజనం అందుతున్నదా వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. మరుగుదొడ్ల పరిశుభ్రత, డైనింగ్ హాల్ పరిస్థితిని కూడా పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం ఖచ్చితంగా అందించాలని, ఆహార నాణ్యతలో ఎలాంటి రాజీ ఉండకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. స్టోర్ రూమ్‌లో కూరగాయలు నేలపై ఉంచడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, వెంటనే ర్యాక్‌లు ఏర్పాటు చేసి సరైన విధంగా నిల్వ చేయాలని ఆదేశించారు. తాజా కూరగాయలనే వినియోగించాలని సూచించారు. ఈ తనిఖీల్లో మండల ప్రత్యేక అధికారి శ్రీరామ్, తహసిల్దార్ వీరభద్రం, ప్రిన్సిపల్ రవీంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Read Also: BRSలో చేరిన అనంతరం జీవన్ రెడ్డి సంచలన కామెంట్స్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>