కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలోని విఘ్నాలను తొలగించి అందరికీ ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యం ప్రసాదించాలని విగ్నేశ్వరున్ని ప్రార్థించారు. వాడవాడలా వెలిసే వినాయక మండపాల్లో భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించుకోవాలని ప్రజలను సీఎం కోరారు.
అలాగే రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతలు కాపాడాలని, హైదరాబాద్ సహా అన్ని జిల్లా కేంద్రాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని, భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే మండపాల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ అధికారులను సీఎం ఆదేశించారు. ఈ ఏడాది కూడా వినాయకుని మండపాలకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నదని సీఎం పేర్కొన్నారు.
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి: కేసీఆర్
తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలు తొలగించి, విజయాలను అందించే దైవంగా, వినాయకుణ్ణి హిందూ సమాజం కొలుచుకుంటుందని అన్నారు. దైవ పూజలను, ధార్మిక క్రతువులు విఘ్నేశ్వరుని పూజతో ప్రారంభించడం ద్వారా హిందూ సంప్రదాయాల్లో గణనాయకునికి తొలి ప్రాధాన్యతనిస్తామని తెలిపారు.
వాడవాడలా మండపాలు ఏర్పాటు చేసుకుని తొమ్మిది రోజుల పాటు గణేశ్ నవరాత్రులు జరుపుకుంటూ, పిల్లలు పెద్దలు అత్యంత భక్తి శ్రద్ధలతో వినాయకునికి పూజలు నిర్వహిస్తారని తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, వ్యవసాయం తిరిగి గాడినపడి, పాడి పంటలతో తెలంగాణ రైతు కుటుంబాలు సుఖ సంతోషాలతో వర్ధిల్లేలా దీవించాలని కోరారు.

