కలం, వరంగల్ బ్యూరో : లిఫ్ట్ ఇచ్చి మహిళపై అఘాయిత్యం చేసి, దొంగతనానికి పాల్పడిన నిందితుడిని చిట్యాల (Chityal) పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు సీఐ మల్లేష్ సంఘటన వివరాలు మీడియాకు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ కుషీనగర్ జిల్లాకు చెందిన అమర్జిత్ సింగ్ (33) హార్వెస్టర్ డ్రైవర్‌గా పనిచేస్తూ పనుల నిమిత్తం వివిధ రాష్ట్రాల్లో సంచరిస్తూ ఉండేవాడు. ఈ నెల 18న జమ్మికుంట రైల్వే స్టేషన్‌కు (Jammikunta Railway Station) వచ్చి మద్యం సేవించిన అనంతరం, వైన్ షాప్ ముందు నిలిపి ఉంచిన ఒక మోటార్ సైకిల్‌ను దొంగిలించాడు. అక్కడి నుంచి భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం రాఘవరెడ్డిపేట గ్రామం వైపు బయలుదేరాడు. అదే రోజు రాత్రి సుమారు 7 గంటల సమయంలో రాఘవరెడ్డిపేట సెంటర్ వద్ద టేకుమట్ల గ్రామానికి వెళ్లేందుకు లిఫ్ట్ కోసం ఎదురుచూస్తున్న ఒక మహిళను తన బండిపై ఎక్కించుకొని ఆరేపల్లి వైపు తీసుకెళ్లాడు.
అక్కడ నిర్మానుష్య ప్రదేశంలో వాహనం ఆపి ఆమెను చెట్ల పొదల్లోకి ఈడ్చుకెళ్లి భౌతిక దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం మహిళ పై లైంగిక దాడికి ప్రయత్నించాడు. బాధితురాలు ప్రతిఘటించడంతో ఆమె వద్ద ఉన్న హ్యాండ్ బ్యాగ్‌ను దొంగిలించి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. చిట్యాల (Chityal) పరిధిలోని కైలాపూర్ సబ్ స్టేషన్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తుండగా పారిపోవడానికి ప్రయత్నించిన అమర్జిత్ సింగ్ ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుండి దొంగిలించిన మోటార్ సైకిల్‌తో పాటు బాధితురాలి వస్తువులను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ డి.మల్లేశ్ తెలిపారు.
Read Also: నా పేరుతో వేరే వాళ్లు ఓటు వేశారు : నటి అక్షయ హరిహరన్
Follow Us On: Instagram

