కలం, వెబ్ డెస్క్ : ఏపీలో సంచలనంగా మారిన గాదే సాయికృష్ణ మిస్సింగ్ కేసులో వైసీపీ నేతలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను అనవసరంగా వివాదంలోకి లాగుతున్నారని సీఎం చంద్రబాబు ( Chandrababu) సీరియస్ అయ్యారు. సాయికృష్ణ మిస్సింగ్ కేసుపై మంత్రులతో సమీక్ష చేసిన సీఎం వారికి పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేతల విమర్శలకు మంత్రులంతా స్పందించాలన్నారు.
సాయికృష్ణ మిస్సింగ్ కేసుపై ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ కేసుపై సిట్ దర్యాప్తు కొనసాగుతుందని.. నిష్పక్షపాత విచారణే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. అయితే వైసీపీ క్రిమినల్స్ ను వెనుకేసుకొస్తుందని ఆరోపించారు. కులాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్న వైసీపీ కుట్రలను తిప్పికొట్టాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. పవన్ కళ్యాణ్ ను అనవసర విషయాల్లోకి లాగితే కూటమి ఐక్యతను చాటేలా మంత్రులంతా స్పందించాలని ఆదేశాలు జారీ చేశారు.
ఇదిలాఉంటే కాపు వ్యక్తి అయిన సాయికృష్ణ మిస్సింగ్ పై డిప్యూటీ సీఎంకు చిత్తశుద్ధి లేదా? అని వైసీపీ నేతలు చేసిన కామెంట్స్ కు పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు. ఒక రౌడీ చనిపోతే తనను ఎందుకు లాగుతున్నారని .. ఈ కేసులో కులాల ప్రస్తావన ఎందుకు అని పవన్ కళ్యాణ్ అన్నారు. నేరస్థులకు కులం ఉండదని.. తప్పుచేసే వారికి, మానభంగాలు చేసే వారికి కులమనేది అంటగట్టవద్దని, అసలు కుల దరిద్రం వదిలితే తప్ప ఏపీ బాగుపడదని వ్యాఖ్యానించారు. క్రిమినల్ అయితే చంపేస్తారా? అలా చంపేసే హక్కు మీకు ఎక్కడిది? అంటూ పవన్ కళ్యాణ్ కు వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. దీంతో సీఎం చంద్రబాబు రంగంలోకి దిగి మంత్రులకు తాజా ఆదేశాలు జారీ చేశారు.

