ఆర్టీసీ సమ్మె విరమణ.. రోడ్డెక్కనున్న బస్సులు

కలం, తెలంగాణ బ్యూరో: ఆర్టీసీ (TGSRTC) కార్మికులు ఈ నెల 22 నుంచి మొదలుపెట్టిన నిరవధిక సమ్మెను విరమించారు. కార్మిక సంఘాల జేఏసీ ప్రతినిధులతో డిప్యూటీ సీఎం సహా మంత్రుల బృందం జరిపిన చర్చల్లో ఏకాభిప్రాయం కుదిరింది. ఈ సందర్భంగా సమ్మెను విరమిస్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ అధికారికంగా ప్రకటించింది. దీంతో నేటి అర్ధరాత్రి నుంచే బస్సులు రోడ్డెక్కనున్నాయి. సమ్మెకు కారణమైన మూడు ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి నిర్దిష్ట టైమ్ బౌండ్ డెడ్‌లైన్ పెట్టుకుని పూర్తి చేయడానికి మంత్రుల బృందం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఈ ప్రక్రియపై అధికారులు అధ్యయనం చేసిన వివరాలు చర్చకు వచ్చాయి. కార్మిక సంఘాల (ట్రేడ్ యూనియన్) ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని, దాన్ని ఆర్టీసీ యాజమాన్యంతో చర్చించుకుని ఫైనల్ చేసుకోవాలని ప్రభుత్వం తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఆర్టీసీ కార్మికులకు 10 శాతం పీఆర్సీ చెల్లించడానికి కూడా ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చింది. దీంతో కార్మిక సంఘాలు సమ్మెను విరమించడానికి అంగీకరించాయి. ముఖ్యమంత్రి ఆదేశం మేరకు మంత్రుల బృందం సచివాలయంలో ఉదయం మొదలు రాత్రి వరకు దాదాపు పన్నెండు గంటలకు పైగా చర్చలు జరిపిన తర్వాత ఏకాభిప్రాయం కుదరడంతో సఫలమయ్యాయి.

ట్రేడ్ యూనియన్లకు ఎన్నికలు జరపడం, గుర్తింపు సంఘంగా గుర్తించడానికి ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని మంత్రులు ఈ సమావేశంలో జేఏసీ ప్రతినిధులకు స్పష్టం చేశారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనమయ్యేంతవరకే గుర్తింపు సంఘం ఉంటుందని, ఆ తర్వాత ఇది ఉనికిలో ఉండదని మంత్రులు వివరించారు. ఆర్టీసీ సిబ్బంది మొత్తం ప్రభుత్వ ఉద్యోగులు అవుతారని, వారికి పీఆర్సీ లాంటివి విడిగా ఉండవని పేర్కొన్నారు. ఆర్టీసీలో కారుణ్య నియామకాలపైనా ప్రభుత్వానికి ఇబ్బంది లేదని వివరించారు. ఇప్పటికే ఆర్టీసీ సిబ్బందికి అందాల్సిన 2021, 2025 పీఆర్సీ ఫిట్‌మెంట్ బకాయిల విషయంలో పేమెంట్ కోసం కొంత గడువు కావాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మంత్రుల బృందం వివరణ ఇవ్వడం, జేఏసీ ప్రతినిధులు వాదనలు వినిపించడం, సుదీర్ఘ చర్చల అనంతరం బకాయిల చెల్లింపుపై ఒక ఉమ్మడి అవగాహన కుదిరింది. ప్రైవేటు బస్సులు, అద్దె బస్సులు, ఈవీ (ఎలక్ట్రిక్) బస్సులు వచ్చినా ఉద్యోగాలు పోవని ప్రభుత్వం హామీ ఇచ్చింది.

గత ప్రభుత్వంలోని అవమానాలపై చర్చ :

గత ప్రభుత్వంలో సమ్మె చేసిన సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కనీసం ఆర్టీసీ (TGSRTC) కార్మికుల సమ్మె గురించి, వారి సంక్షేమం ఊసే ఎత్తలేదని, చర్చలకు పిలవనే లేదనే అంశాన్ని సైతం జేఏసీ ప్రతినిధులు గుర్తుచేసుకున్నారు. కానీ ప్రస్తుతం సమ్మె రెండో రోజునే ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని చర్చల ద్వారా పరిష్కరించుకుందామని స్వచ్ఛందంగా పిలుపు ఇచ్చారని, దానికి కొనసాగింపుగా అధికారుల కమిటీకి, డిప్యూటీ సీఎం నేతృత్వంలోని మంత్రుల బృందానికి ఆదేశాలు ఇచ్చారని, ఆ ప్రకారమే ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయన్న అంశం సైతం ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వానికి స్పష్టమైన అభిప్రాయమే ఉన్నదని, ఆ సంస్థను కాపాడుకోవాలన్న తపనతోనే మహాలక్ష్మి స్కీమ్‌తో ఆదాయం పడిపోతున్నా ప్రభుత్వం రీఇంబర్స్ చేసి కాపాడుతున్నదనే అంశంపైనా ప్రతినిధులు రియలైజ్ అయ్యారు. అందులో భాగంగానే నర్సంపేట్ డ్రైవర్ మృతదేహాన్ని డిపో దగ్గరకు తీసుకెళ్ళడం, ఆ తర్వాత అంత్యక్రియలు జరపడానికి తోటి కార్మికులు ఒప్పుకున్నారు.

ఆర్థిక ఇబ్బందులున్న డీఏలు క్లియర్ :

గత ప్రభుత్వంలో జీతం ఎప్పుడొస్తుందో తెలియని అనిశ్చితి కొనసాగితే ఇప్పుడు ప్రతి నెలా ఠంచన్‌గా ఒకటో తేదీనే వస్తున్నదని, ఒక్క డీఏ కూడా పెండింగ్‌లో లేకుండా అన్నీ క్లియర్ అయ్యాయన్న అంశంపైనా ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే దశాబ్దాల పెండింగ్ సమస్యలు పరిష్కారమయ్యాయని ఆర్టీసీ సంఘాల నేతలు అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వం లో 52 రోజుల సమ్మె చేసినా, పలు హామీలు గుప్పించినా నెరవేరలేదన్న అభిప్రాయాన్ని గుర్తుచేసుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేండ్లలోనే 2013 నాటి బాండ్లకు సంబంధించిన రూ. 280 కోట్లు క్లియర్ అయ్యాయని, 2017 సంవత్సరానికి సంబంధించి పీఆర్సీ బకాయిలు పాక్షికంగా విడుదలయ్యాయని, పెండింగ్‌లో ఉన్న డీఏలన్నీ క్లియర్ అయ్యాయని, గత ప్రభుత్వంలో సర్వీసు నుండి శాశ్వతంగా రిమూవ్ అయిన వారికి త్రిసభ్య కమిటీ చొరవతో 270 మందికి ఉద్యోగాలు వచ్చాయని, సహకార సొసైటీ బకాయిలతో పాటు ప్రావిడెంట్ ఫండ్ పెండింగ్ ఫండ్స్ తీరిపోయాని ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు గుర్తుచేసుకున్నారు. యూనియన్లు లేని కారణంగానే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అనేక కార్మిక సంక్షేమ కార్యక్రమాలకు ప్రచారం జరగలేదని మంత్రులకు ఆర్టీసీ  జేఏసీ (TGSRTC JAC) వివరించింది.

Read Also: HCAలో అక్రమాలు.. సిట్ ఏర్పాటుకు హైకోర్టు ఆదేశాలు

Follow Us on: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>