Mobile Popup Ad
Mobile Popup Ad

కాళేశ్వరంలో కేసులో బీఆర్ఎస్ గోబెల్స్ ప్రచారం: విప్ వేముల

కలం, నల్లగొండ బ్యూరో: బీఆర్ఎస్ (BRS) పార్టీ తమ అవినీతి ఎక్కడ బయటపడుతుందోననే భయంతోనే కోర్టును ఆశ్రయించిందని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Veeresham) ఆరోపించారు. కాళేశ్వరం కేసులో కోర్టు స్టే తెచ్చుకుని ఇప్పుడు కేసు మొత్తం గెలిచినట్టుగా బీఆర్ఎస్ నేతలు గోబెల్స్ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. బుధవారం నకిరేకల్‌లోని తన క్యాంపు కార్యాలయంలో వేముల వీరేశం మీడియాతో మాట్లాడారు. పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా కొన్ని అంశాలపై చర్యలు తీసుకోవద్దని మాత్రమే హైకోర్టు సూచించిందన్నారు. నిజానికి కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నియామకాన్ని బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి తప్పుబడుతూనే ఉందని తెలిపారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో (Kaleshwaram Project) జరిగిన నాణ్యత, నిర్మాణ లోపాల కారణంగా ప్రాజెక్టుకు భారీ నష్టం జరిగిందని, వేలాది కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అయ్యిందని వేముల ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యత వహించాల్సిందివారే కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవడం అంటే అసలు దొంగలు ఎవరో తెలంగాణ ప్రజలు గమనించాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపేందుకు, అవసరమైతే సీబీఐ దర్యాప్తు కూడా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు. అవినీతికి ఎవరు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం గతంలో కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ నేతలు ఏటీఎంలా ఉపయోగించుకున్నారని ప్రస్తావించిన మాటలు వాస్తవం కాదా..? అని వేముల ప్రశ్నించారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం కూడా తమ వైఖరిని స్పష్టం చేయాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు.

పదేండ్లపాటు అధికారంలో ఉండి దోచుకొని దాచుకున్న బీఆర్ఎస్ జిల్లా నాయకులు ఇప్పుడు అహంకారంతో మాట్లాడటం సమంజసంగా లేదన్నారు. సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఘోరంగా ఓడించినా ఆ నాయకుడికి జ్ఞానోదయం అయినట్లు లేదని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి ప్రజల సొమ్మును దోచుకున్నారనేది తన విమర్శ మాత్రమే కాదని, ప్రజల్లో బలంగా ఉన్న అభిప్రాయమని అన్నారు. కాళేశ్వరం అవినీతిపై పూర్తి నిజాలు వెలుగులోకి వచ్చి, బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు కాంగ్రెస్ ప్రభుత్వ పోరాటం కొనసాగుతుందని వేముల (Vemula Veeresham) స్పష్టం చేశారు.

Read Also: కల్వల ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయండి!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>