బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కరెంటు కోతలపై రైతుల ధర్నా

కలం, వనపర్తి: బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వనపర్తి మండలం కడుకుంట్ల, పెద్దగూడెం రైతులు ఆందోళనకు దిగారు. కడుకుంట్ల విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఎదుట కడుకుంట్ల–వనపర్తి ప్రధాన రహదారిపై ధర్నా (Wanaparthy Farmers) చేపట్టారు. వ్యవసాయానికి 12 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తామని ప్రభుత్వం చెబుతున్నా.. కనీసం ఆరు గంటలు కూడా సక్రమంగా, నాణ్యమైన విద్యుత్‌ అందడం లేదని ఆరోపించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. విద్యుత్‌ కోతలతో బోర్లు, మోటార్లు సక్రమంగా పనిచేయడం లేదని.. ఫలితంగా పంటలకు సాగునీరు అందక ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

పంటలను కాపాడాలి..

వ్యవసాయానికి నిరంతర విద్యుత్‌ సరఫరా చేసి పంటలను కాపాడాలని రైతులు డిమాండ్‌ చేశారు. గతంలో విద్యుత్‌ అందుబాటు తక్కువగా ఉన్న సమయంలోనూ అప్పటి ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ సరఫరా చేసిందని గుర్తుచేశారు. ప్రస్తుతం విద్యుత్‌ అందుబాటులో ఉన్నప్పటికీ రైతులకు ఇబ్బందులు ఎందుకు కలుగుతున్నాయని ప్రశ్నించారు.

విద్యుత్ డిమాండ్ వల్లే ఇబ్బందులు..

రైతుల ఆందోళన విషయం తెలుసుకున్న విద్యుత్ అధికారులు అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.ఎల్‌నినో ప్రభావంతో విద్యుత్‌ డిమాండ్‌ పెరగడం వల్ల సరిపడా సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులకు వివరించినట్లు ఎలక్ట్రికల్‌ డీఈ శ్రీనివాసులు తెలిపారు. అనంతరం అదనపు కలెక్టర్‌ ఖీమ్యా నాయక్‌, డీఈ శ్రీనివాసులు రైతులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వ్యవసాయానికి విద్యుత్‌ సరఫరా సక్రమంగా అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.

ఈ ధర్నాలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కేమాణిక్యం, రఘువర్ధన్‌రెడ్డి, మాధవరెడ్డి, ధర్మనాయక్‌, డేగ మహేశ్వర్‌రెడ్డి, చిట్యాల రాము, లక్ష్మీకాంత్‌రెడ్డి, సర్పంచ్‌ తిరుపతయ్య, మాజీ సర్పంచులు హరిత బాలకృష్ణ, కొండయ్య, కృష్ణనాయక్‌, మనీష్‌, గ్రామ అధ్యక్షుడు వెంకటేష్‌, అశోక్‌ తదితర నాయకులు, రైతులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>