కలం, మునుగోడు: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయినా ఎన్నికల హామీలను అమలు చేయలేయడంలో విఫలమైందని బీఆర్ఎస్ మండిపడింది. మునుగోడు చౌరస్తాలో బుధవారం భారీ ధర్నా, నిరసన చేపట్టింది. ఈ కార్యక్రమానికి మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి (Kusukuntla Prabhakar Reddy) హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి మోసం చేసిందని విమర్శించారు. వెయ్యి రోజులు గడిచినా ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ పూర్తిస్థాయిలో అమలు కాలేదన్నారు.
మహిళలకు నెలకు రూ.2,500 సాయం, తులం బంగారం, విద్యార్థినులకు ఉచిత స్కూటీలు, నిరుద్యోగ భృతి, విద్యా భరోసా కార్డులు, రెండు లక్షల ఉద్యోగాల భర్తీ లాంటి హామీలను విస్మరించిందని ప్రభాకర్‌రెడ్డి అన్నారు.
రైతులు, మహిళలు, యువత, విద్యార్థులను కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా నిరాశకు గురిచేసిందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే వరకు బీఆర్‌ఎస్ రాజీలేని పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, వివిధ మండలాల పార్టీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

