కలం, వెబ్ డెస్క్: లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడం(Women Bill Failure)తో రేపు బీజేపీ నిరసనలకు పిలుపునిచ్చింది. కేంద్రం ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగసవరణ బిల్లును లోక్‌సభలో వీగిన విషయం తెలిసిందే. దీంతో ఎన్డీయే సర్కారుకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్టైంది. మహిళా బిల్లు వీగిపోవడానికి కాంగ్రెస్, విపక్షాలే కారణమని బీజేపీ ఆరోపిస్తోంది. విపక్షాల తీరుకు నిరసనగా రేపు దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నట్టు బీజేపీ ప్రకటించింది. దేశంలో మహిళా సాధికారత సాధించడం కాంగ్రెస్ పార్టీకి, విపక్షాలకు ఇష్టం లేదని.. డీలిమిటేషన్‌పై తప్పుడు ప్రచారం చేస్తూ బిల్లు వీగిపోయేలా చేశారని బీజేపీ ఆరోపించింది. బిల్లు వీగిపోయిన అనంతరం ఎన్డీయే ఎంపీలు పార్లమెంటు బయట నిరసనలు తెలిపారు. రాహుల్ గాంధీకి, విపక్షానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహిళా బిల్లు వీగిపోవడానికి విపక్షమే కారణమంటూ విమర్శలు చేశారు. రేపు దేశవ్యాప్తంగా బీజేపీ నిరసనలు చేపట్టబోతున్నది. మహిళా బిల్లు విషయంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీనే ప్రధానంగా టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది.
విపక్షాల ద్వంద్వ వైఖరి
మహిళా బిల్లు విషయంలో విపక్షాలు ద్వంద్వ వైఖరిని అవలంభించామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆరోపించారు. మహిళలకు మద్దతుగా నిలబడే చారిత్రాత్మక అవకాశం వారికి లభించినా ఉపయోగించుకోలేదన్నారు. మహిళా సాధికారత వాళ్లకు కేవలం ప్రసంగాలు, నినాదాలకే పరిమితమైందని చెప్పారు. ప్రతిపక్షాల తీరును దేశప్రజలు, దేశంలోని మహిళలు నిశితంగా గమనించారని చెప్పారు. మేం రేపటి నుంచి వీధుల్లోకి వస్తామని.. మహిళకు అండగా నిలబడతామని ఫడ్నవీస్ పేర్కొన్నారు.

