వినాయక మాల వేసుకున్నాడని స్కూల్‌లోకి అనుమతి నిరాకరణ

కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం (Khammam) నగరంలోని మమతా రోడ్డులో ఉన్న హార్వెస్ట్ జూనియర్ కళాశాలలో మంగళవారం తీవ్ర వివాదం చెలరేగింది. వినాయక చవితి సందర్భంగా వినాయక మాల ధరించి కళాశాలకు వచ్చిన ఆరుగురు విద్యార్థులను తరగతి గదుల్లోకి అనుమతించకుండా యాజమాన్యం బయటే నిలిపివేసిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ధరించిన మాలను తొలగించి వస్తేనే తరగతులకు అనుమతిస్తామని కళాశాల సిబ్బంది స్పష్టం చేయడంతో వివాదం మొదలైంది.

​ఈ విషయం తెలిసిన వెంటనే విద్యార్థుల కుటుంబ సభ్యులతో పాటు బీజేపీ, ఏబీవీపీ, ఇతర హిందూ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున కళాశాల వద్దకు చేరుకుని నిరసన చేపట్టారు. విద్యార్థుల మతపరమైన విశ్వాసాలను గౌరవించి, వారిని వెంటనే తరగతులకు అనుమతించాలని డిమాండ్ చేశారు. భారతదేశం వంటి లౌకిక దేశంలో మతాల మధ్య చిచ్చు పెట్టేలా కళాశాల యాజమాన్యం వ్యవహరిస్తోందని, గతంలోనూ అంతర్జాతీయ వివాదాల సమయంలో విద్యార్థులతో బుర్కాలు ధరింపజేసి వివాదాలకు తెరలేపిన చరిత్ర ఈ యాజమాన్యానికి ఉందని నాయకులు ఆరోపించారు.

హిందూ వ్యతిరేక ధోరణి అవలంబిస్తున్న హార్వెస్ట్ కళాశాల అనుమతులను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ​ఘటనా స్థలంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకునే అవకాశం ఉండటంతో పోలీసులు, అధికారులు పరిస్థితిని గమనిస్తూ భద్రతను పర్యవేక్షించారు. చివరకు ఆందోళన తీవ్రతరం కావడంతో కళాశాల యాజమాన్యం దిగివచ్చి, విద్యార్థులకు బొట్టు పెట్టి తరగతి గదుల్లోకి అనుమతించడంతో పరిస్థితి తాత్కాలికంగా సద్దుమణిగింది. అయితే, ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హిందూ సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>