గులాబీ తీర్థం పుచ్చుకున్న కాంగ్రెస్ నాయకుడు భార్గవ్

కలం, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎన్‌ఎస్‌యూఐ(NSUI) రాష్ట్ర అధ్యక్షుడు భార్గవ్ దేశ్‌పాండే (Bhargav Deshpande) బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆదివారం హైదరాబాద్‌లోని కేటీఆర్ నివాసంలో జరిగిన కార్యక్రమంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

బీఆర్‌ఎస్‌లో చేరిన అనంతరం భార్గవ్ దేశ్‌పాండే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy)పై తీవ్ర విమర్శలు చేశారు. 2006లో ఎన్‌ఎస్‌యూఐ జెండాతో కాంగ్రెస్‌లో చేరిన తాను, అప్పటి నుంచి ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా, జిల్లా అధ్యక్షుడిగా, ఏఐసీసీ సభ్యుడిగా పనిచేశానని తెలిపారు. అప్పటి కాంగ్రెస్‌కు, ఇప్పటి కాంగ్రెస్‌కు చాలా తేడా ఉందన్నారు. రేవంత్‌రెడ్డి టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ టీడీపీ, ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ ప్రభావంలో పనిచేస్తోందని ఆరోపించారు.

ఢిల్లీలో రాహుల్‌గాంధీ రాజ్యాంగ పరిరక్షణ, విద్యార్థులు, యువత భావప్రకటన స్వేచ్ఛ గురించి మాట్లాడుతుంటే, తెలంగాణలో అందుకు విరుద్ధమైన పాలన కొనసాగుతోందని భార్గవ్ (Bhargav Deshpande) విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీని తానే అధికారంలోకి తీసుకొచ్చానని రేవంత్‌రెడ్డి చెప్పుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, టీడీపీలో ఉన్నప్పుడు ఎందుకు అధికారంలోకి తీసుకురాలేకపోయారని ప్రశ్నించారు. ఇది ప్రజాపాలన కాదని, ప్రజావ్యతిరేక పాలన అని ఆరోపించారు. రాజీవ్‌గాంధీ, ఇందిరాగాంధీల పేర్లు ప్రస్తావించే నైతిక హక్కు రేవంత్‌రెడ్డికి లేదన్నారు.

ప్రభుత్వ పనితీరుపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మోసపూరిత హామీలతో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని, మూడేళ్లలో ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. కాంగ్రెస్‌లోని అసలైన నాయకులు బయటకు వచ్చి ‘లీవ్‌ కాంగ్రెస్‌ – సేవ్‌ తెలంగాణ’ నినాదంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణకు కేసీఆర్‌ మాత్రమే శ్రీరామరక్ష అని, యువతకు భరోసా కల్పించే నాయకుడు కేటీఆర్‌ అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బోథ్, ఆసిఫాబాద్, బాల్కొండ ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, కోవ లక్ష్మి, వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ మంత్రి జోగు రామన్న, ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జి జాన్సన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Also Read : ‘మన్ కీ బాత్‌’లో ‘కొమురం భీమ్’ స్మరణ గర్వకారణం: కలెక్టర్ రాజర్షి షా

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>