కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం పెండింగ్ బకాయిలు రూ.3900 కోట్లు వెంటనే చెల్లించాలని ఆల్కహాలిక్ బేవరేజెస్ కంపెనీలు (Beverages Companies) కోరాయి. ఈ మేరకు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆల్కహాలిక్ బేవరేజ్ కంపెనీస్, ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, బ్రూవర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి. మద్యం సరఫరా దారులకు చెల్లించాల్సిన బకాయిల్లో రూ.900 కోట్లు గతేడాదిగా పెండింగ్ లోనే ఉన్నాయని కంపెనీలు తెలిపాయి.
రాష్ట్ర ప్రభుత్వానికి మూడో వంతు ఆదాయం ఈ రంగం నుంచే వస్తోందని.. అయినా ప్రభుత్వం తమకు బకాయిలు చెల్లించట్లేదని కంపెనీలు వివరించాయి. రూల్స్ ప్రకారం 45 రోజుల్లోనే చెల్లింపులు చేయాల్సి ఉన్నా ప్రభుత్వం ఆ విధంగా చర్యలు తీసుకోవట్లేదని బేవరేజెస్ కంపెనీలు చెప్పాయి. ప్రభుత్వానికి మద్యం అమ్మకాల ద్వారా 2023–24 మధ్య రూ.38వేల కోట్ల ఆదాయం వచ్చిందని.. 2025లో రిటైల్ లైసెన్సుల అప్లికేషన్ల నుంచే రూ.3వేల కోట్లు ఆదాయం వచ్చిందని కంపెనీలు వివరించాయి. ఇంత ఆదాయం వస్తోంది కాబట్టి తమ బకాయిలు త్వరగా చెల్లించాలని కోరాయి. త్వరలోనే దావోస్ పెట్టుబడలను ఆకర్షించేందుకు ప్రభుత్వం రెడీ అవుతోందని.. తమ బకాయిలు చెల్లిస్తే అంతర్జాతీయ స్థాయిలో ప్రభుత్వంపై విశ్వసనీయత పెరుగుతుందని బేవరేజెస్ కంపెనీలు చెబుతున్నాయి.


