కలం మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా జోగిపేట (Jogipet)లో ఓ బీఫ్ షాప్ (Beef Shop) పంచాయితీ విషయం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇరు వర్గాలు రోడ్డుపైన కర్రలతో దాడులు చేసుకోవడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. రంగంలోకి దిగిన జోగిపేట పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. వివరాల్లోకి వెళ్తే.. అందోల్ గ్రామానికి చెందిన కటికే, ముస్లింలు గత కొన్నేళ్లుగా తమకు జోగిపేటలోని బీఫ్ షాప్‌లో వాటా ఉందని అంటున్నారు. కానీ, జోగిపేటకు చెందిన ముస్లింలు బీఫ్ షాపులో వారికి ఎలాంటి వాటా లేదని వాదిస్తున్నారు. ఈ విషయంపై గత వారం రోజులుగా వివాదం నడుస్తోంది.
శనివారం ఉదయం జోగిపేట మున్సిపల్ చైర్మన్ కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ చిట్టిబాబు ఆధ్వర్యంలో ఇరు వర్గాల వారితో పంచాయితీ జరిగింది. కానీ, వాటాలకు సంబంధించిన విషయంలో పంచాయితీలో మాటా మాటా పెరిగి ఇరు వర్గాలు పరస్పర దాడులు చేసుకున్నారు. పలువురికి గాయాలయ్యాయి. దాడిలో తీవ్ర గాయపడ్డ జోగిపేటకు చెందిన కైసర్, ఖలీమ్‌లు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
పోలీసులు వారిని వైద్య చికిత్సల కోసం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. అయితే ఆసుపత్రికి వెళ్లి మరో సారి అక్కడ డాక్టర్ సమక్షంలోనే కైసర్‌పై అందోల్ కటికే ముస్లింలు దాడికి పాల్పడ్డారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రిలో రెండు గంటల పాటుగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

