కలం, మునుగోడు: పార్లమెంటులో రైతు పండించిన అన్ని రకాల పంటలకు మద్దతు ధరల గ్యారెంటీ చట్టం చేయాలని రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బండ శ్రీశైలం (Banda Srisailam) డిమాండ్ చేశారు. నవంబర్ 15 నుండి 18 వరకు నల్లగొండలో జరిగే అఖిల భారత రైతు మహాసభలు జరుగనున్నట్లు తెలిపారు. ఆదివారం చండూరు మండల కేంద్రంలో సీపీఐ మండల కమిటీ సమావేశం మొగుదాల వెంకటేశం అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బండ శ్రీశైలం మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక 3 నల్ల చట్టాల వల్ల రైతాంగానికి తీవ్ర నష్టం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులకు పండించిన పంటకు ధరలు పెరగడం లేదని దీనితో రైతు ఆత్మహత్యలు పెరిగాయని శ్రీశైలం ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు నష్టం కలిగించే నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, పాత కార్మిక చట్టాలను పునరుద్ధరించాలన్నారు. ఇటీవల భారత్- అమెరికా చేసుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం వల్ల దేశ స్వాతంత్రానికి, సార్వభౌమత్వానికి తాకట్టు పెట్టే విధంగా ఉందని, దీనికి వ్యతిరేకంగా వ్యవసాయ రంగా రక్షణ కోసం రైతులు నిరంతరం ఉద్యమాలు చేయాలన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా పూర్తిగా విఫలమైందని శ్రీశైలం మండిపడ్డారు. రెండు లక్షల రుణమాఫీ, రైతు భరోసా అందడం లేదని, ధరణి స్థానంలో భూభారతి తీసుకొచ్చినప్పటికీ ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయిందన్నారు. యూరియా, పత్తి ఆన్లైన్ యాప్ ల పేరుతో రైతులను గోసపెడుతుందని, సరైన సమయంలో పంటలకు వర్షాలు రాకపోవడంతో రైతన్న పండించిన పంటలకు ఇప్పటికే తీవ్రంగా నష్టపోవడం జరిగిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలను మానుకోవాలన్నారు.
అఖిల భారత మహాసభలు నవంబర్ 15 నుండి 18 వరకు నల్లగొండలోజరుగుతున్నాయని, ఈ మహాసభల జయప్రదానికి ఈ ప్రాంత ప్రజలు ఆర్థిక తోడ్పాటు అందించి రైతాంగ ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లాలని శ్రీశైలం సూచించారు . ఈ కార్యక్రమంలో సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ, సిపిఎం మండల కమిటీ సభ్యులు చిట్టిమల్ల లింగయ్య, మోగుదాల వెంకటేశం, ఈరటి వెంకటయ్య, కొత్తపల్లి నరసింహ, గౌసియా బేగం,కంచర్ల రవి తదితరులు పాల్గొన్నారు.

