కలం, వెబ్ డెస్క్: 2029 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు అమలు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని హోం మంత్రి అమిత్ షా (Amit Shah) వెల్లడించారు. లోక్‌సభలో మహిళా బిల్లు, డీలిమిటేషన్, యూటీ చట్టాల సవరణ బిల్లులపై జరిగిన చర్చ అనంతరం అమిత్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ బిల్లు (Women Reservation Bill)ను విపక్షాలు వ్యతిరేకించాయని వెల్లడించారు. మూడు బిల్లులపై సమగ్రంగా చర్చ జరిగిందని, 130 మంది ఎంపీలు తమ అభిప్రాయాలు చెప్పారని తెలిపారు. మహిళా బిల్లుపై 56 మంది మహిళా ఎంపీలు చర్చలో పాల్గొన్నారని వెల్లడించారు. సభలో అన్ని పార్టీలు తమ వాదనను వినిపించాయని, ఇండియా కూటమి సభ్యులు మహిళా బిల్లును వ్యతిరేకించారని తెలిపారు. మహిళా సాధికారతను సాకారం చేసేందుకే రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకొచ్చామని అమిత్ షా స్పష్టం చేశారు. ఇండియా కూటమి ఎంపీలు మహిళా బిల్లుపై నాన్చుడు ధోరణితో వ్యతిరేకత వ్యక్తం చేశాయన్నారు. లోక్‌సభలో ప్రవేశ పెట్టిన మూడు బిల్లులకు మహిళా బిల్లుతో సంబంధం ఉన్నదని అమిత్ షా వ్యాఖ్యానించారు.
దేశంలో 1971 నుంచి సీట్ల పెంపుపై ఫ్రీజ్ ఉందని అమిత్ షా తెలిపారు. తెలంగాణలోని మల్కాజిగిరిలో 38 లక్షల మంది ఓటర్లు ఉన్నారని, ఇలాంటి నియోజకవర్గాలు దేశంలో ఇంకా చాలా ఉన్నాయని అమిత్ షా తెలిపారు. ఒకే దగ్గర 38 లక్షల ఓటర్లు ఉంటే, మరో చోట కేవలం 6 లక్షలే ఉన్నారని తెలిపారు. డీలిమిటేషన్ (Delimitation)తో ఈ తప్పులను సరిచేసే అవకాశం ఉందని అన్నారు. ఎమర్జెన్సీ కాలంలో కాంగ్రెస్ కావాలనే డీలిమిటేషన్‌ను ఆపిందని, ఇప్పుడు విపక్షంలో ఉండి కూడా ఆపాలని ప్రయత్నిస్తోందని అమిత్ షా విమర్శించారు. డీలిమిటేషన్‌ను వ్యతిరేకిస్తే ఎస్సీ, ఎస్టీ సీట్ల పెంపును వ్యతిరేకించినట్లేనని చెప్పారు. జనాభా లెక్కలకు, డీలిమిటేషన్ తమ ప్రభుత్వం లింక్ పెట్టలేదని అమిత్ స్పష్టం చేశారు. కరోనా కారణంగా 2021లో జనాభా లెక్కలు చేయలేకపోయామని చెప్పారు. 2024లో చేద్దామనుకుంటే కుల గణనను తెరపైకి తీసుకొచ్చారని చెప్పారు. ఆ తర్వాత అందరి అభిప్రాయాలతో 2026లో కుల గణనతో పాటు జన గణన చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. కాంగ్రెస్ సభ్యులు అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్లు నటిస్తున్నారని విమర్శించారు. ఇక రాహుల్ గాంధీ ప్రసంగంపై అమిత్ షా విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీకి సభా సమయం వృథా చేయడం అలవాటుగా మారిందన్నారు.

