న‌ర‌సింహ స్వామికే శ‌ఠ‌గోపం.. యాదాద్రి ఆల‌య ఆదాయానికి గండి!

కలం, నల్లగొండ బ్యూరో: ఒకవైపు ప్రభుత్వం భక్తుల సౌకర్యాల కోసం కోట్లు ఖర్చు చేస్తోంది.. మరోవైపు సామాన్య భక్తుడు హుండీలో వేసే ప్రతి రూపాయి ఆలయ అభివృద్ధికి చేరాలని కోరుకుంటాడు. కానీ, యాదగిరిగుట్ట (Yadadri) లక్ష్మీనరసింహ స్వామి కొండపై మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. కొందరు సంఘంగా ఏర్పడి దేవస్థాన ఆదాయానికి గండి కొడుతూ.. సామాన్య నిరుద్యోగికి దక్కాల్సిన ఉపాధిని కాలరాస్తున్నారు. ఒక్క సెల్ ఫోన్ కౌంటర్ ఇచ్చే ఆదాయం కంటే 10 దుకాణాలు ఇచ్చే ఆదాయం తక్కువగా ఉందంటే.. అక్కడ సాగుతున్నది వ్యాపారమా..? లేక వ్యవస్థీకృత దోపిడీయా? తరతరాలుగా వ్యాపార సామ్రాజ్యాలను ఏలుతున్న శక్తులకు అధికారులు వత్తాసు పలుకుతున్నారా? అనే ప్రశ్న ఇప్పుడు యాదగిరిగుట్టలో బ‌లంగా వినిపిస్తోంది. తెలంగాణలోనే అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నా.. కొండపై ఉన్న కొన్ని వ్యాపార లావాదేవీలు మాత్రం ఇంకా పాత పద్ధతుల్లోనే సాగుతూ దేవస్థాన ఖజానాకు భారీ నష్టాన్ని కలిగిస్తున్నాయి. దశాబ్దాలుగా పాతుకుపోయిన వర్తక సంఘం ఆధిపత్యం వల్ల ఆలయ ఆదాయానికి గండి పడటమే కాకుండా చిరు వ్యాపారులకు తీరని అన్యాయం జరుగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

సమాన వాటా పేరుతో దోపిడీ..

యాదగిరిగుట్ట (Yadadri) లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కొండపై పూర్వం నుంచే 115 దుకాణాలు నడిచేవి. ఇందులో కొన్ని టెండర్ల ద్వారా రాగా, మరికొన్ని కమిషనర్లు ఆర్డర్లు ఇచ్చారు. దుకాణదారులంతా సంఘంగా ఏర్పాటై విక్రయాలు సాగించేవారు. అయితే యాదగిరిగుట్ట ఆలయ‌ పునర్నిర్మాణ సమయంలో కొండపైన ఉన్న దుకాణాలను తొలగించారు. అనంతరం కొండపైన సరిపడా స్థలం లేకపోవడం భక్తులు ఇబ్బందులు పడుతారని భావించి కొండపై దుకాణ సముదాయం నిర్మించలేదు. దుకాణదారుల కోరిక మేరకు 10 దుకాణాలకు మాత్రమే అనుమతినిచ్చి భక్తుల షాపింగ్‌కు వీలు కల్పించారు. ప్రస్తుతం 10 దుకాణాల నుంచి వచ్చే ఆదాయాన్ని మొత్తం మంది సమానంగా పంచుకుంటున్నారు.

ఆదాయంలో భారీ వ్యత్యాసం

ప్రస్తుత పరిస్థితుల్లో యాదగిరిగుట్ట దేవస్థానానికి వచ్చే ఆదాయంపై వర్తక సంఘం ప్రభావం తీవ్రంగా ఉందని చెప్పాలి. కొండపై ఉన్న 10 దుకాణాలకు గాను వర్తక సంఘం ఏడాదికి కేవలం రూ.1.68 కోట్లు మాత్రమే చెల్లిస్తోంది. అదే సమయంలో దేవస్థానంలో పారదర్శకంగా టెండర్ వేసిన ఒకే ఒక్క సెల్ ఫోన్ కౌంటర్ ద్వారా ఏటా రూ.2. 22 కోట్లకు పైగా ఆదాయం వస్తోంది. కేవలం ఒక చిన్న కౌంటర్‌కే అంత ఆదాయం వస్తుంటే.. కొండపై ఉన్న 10 ప్రధాన దుకాణాలను బహిరంగ టెండర్లు వేస్తే దేవస్థానానికి దాదాపు రూ.20 నుంచి రూ.30 కోట్ల రూపాయల అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మే 31తో ముగియనున్న గడువు

వర్తక సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న తాత్కాలిక దుకాణాల గడువు మే 31 నాటికి ముగియనుంది. సాధారణంగా ఏదైనా టెండర్ ముగియడానికి మూడు నెలల ముందే నోటిఫికేషన్ విడుదల చేయాలి. కానీ, మే నెల దగ్గర పడుతున్నా అధికారులు ఇంకా నోటిఫికేషన్ విడుదల చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కరే దేవస్థానంలో దుకాణాలను కొనసాగించాలనే నియమం ఎక్కడా లేదు. అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి. ముడుపులు అందే వారికి ఒక రూల్.. సామాన్యులకు ఒక రూల్ ఉండకూడదంటూ స్థానిక నిరుద్యోగులు, చిరువ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏండ్లుగా తిష్ట వేసిన వర్తక సంఘాన్ని రద్దు చేసి, బహిరంగ టెండర్లు నిర్వహించాలి. గత ప్రభుత్వం కొండ కింద అన్నదానం కాంప్లెక్స్ వద్ద నిర్మించిన 112 షాపింగ్ కాంప్లెక్స్ షాపులను టెండర్ల ద్వారా కేటాయించాలి. దీని వల్ల స్థానిక నిరుద్యోగ కుటుంబాలకు ఉపాధి లభిస్తుంది. ప్రతి టెండర్‌ను ఒక ఏడాది కాలపరిమితితో నిర్వహించి, కొత్త వారికి వ్యాపార అవకాశాలు కల్పించాలి. రాజకీయ పైరవీలకు తావులేకుండా.. దేవస్థాన నియమ నిబంధనల ప్రకారం టెండర్ల ప్రక్రియ సాగాలి.

రాజకీయ పైరవీలు.. అధికారుల మౌనం..

ప్రభుత్వాలు మారినా.. జెండాలు మారినా.. వర్తక సంఘం నేతలు మాత్రం నాయకుల చుట్టూ తిరుగుతూ తమ పబ్బం గడుపుకుంటున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవస్థానానికి ఆర్థికంగా నష్టం కలిగిస్తున్న ఇటువంటి వారిని గుర్తించి.. ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దేవస్థాన ఆదాయం పెరిగితేనే భక్తుల సౌకర్యాలు, ఆలయ అభివృద్ధి సాధ్యమవుతుంది. ఈ క్రమంలో వ్యక్తిగత ప్రయోజనాల కంటే ఆలయ ప్రయోజనాలకే పెద్దపీట వేయాలి. ఇప్పటికైనా దేవస్థాన అధికారులు స్పందించి మే 31 లోపు టెండర్ల నోటిఫికేషన్ విడుదల చేసి, యాదగిరిగుట్ట (Yadadri) అభివృద్ధిలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాలని అందరూ కోరుకుంటున్నారు.

Read Also: తెలంగాణను వ్యతిరేకిస్తే.. మూల్యం చెల్లించాల్సిందేనా?

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>