పూడిక తీతలో జాప్యం.. ప్రభుత్వాన్ని నిలదీసిన రైతు కూలీ సంఘం

కలం, నిజామాబాద్ బ్యూరో :  తెలంగాణ వరప్రదాయనిగా పేరుగాంచిన శ్రీరామ్ సాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టుల పూడిక తీతపై ప్రభుత్వం పదేపదే హామీలు ఇస్తూ అమలు చేయకపోవడాన్ని అఖిల భారత రైతు కూలీ సంఘం(All India Kisan Mazdoor Sabha) రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేల్పూరి భూమయ్య తీవ్రంగా విమర్శించారు. నిజామాబాద్‌లో(Nizamabad) మీడియాతో మాట్లాడుతూ, ఏడాది దాటినా పూడిక తీత పనులు ప్రారంభం కాకపోవడం రైతులను మోసం చేయడమేనని అన్నారు. ప్రభుత్వం స్పష్టంగా బడ్జెట్‌లో ఎంత నిధులు కేటాయించిందో, ఎప్పుడు పనులు ప్రారంభించి పూర్తి చేస్తారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. జిల్లా ఉపాధ్యక్షుడు అగ్గు ఎర్రన కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇటీవల వర్ని మండలంలోని సిద్దాపూర్ ప్రాంతంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి త్వరలోనే శ్రీరామ్ సాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టుల పూడిక పనులు చేపడతామని చెప్పిన విషయాన్ని భూమయ్య గుర్తు చేశారు. ఇదే హామీ గతంలో కూడా ఇచ్చారని, కానీ ఇప్పటివరకు అమలు కాలేదని విమర్శించారు. అదే విధంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని గడుకోలు సెగ్మెంట్‌కు నీళ్లు అందించే మంచిప్ప 21 ప్యాకేజీ పనులు సగం వరకు పూర్తై నిలిచిపోయాయని పేర్కొన్నారు. ఈ పనులను త్వరగా పూర్తి చేస్తే సుమారు 84 వేల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉందని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పష్టమైన టైమ్‌లైన్ ప్రకటించి, శ్రీరామ్ సాగర్, నిజాంసాగర్, మంచిప్ప 21 ప్యాకేజీ పనులకు తగిన నిధులు కేటాయించి వెంటనే పనులు ప్రారంభించాలని రైతు నాయకులు డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>