కలం, కరీంనగర్ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జాతీయ కార్మిక, రైతు సంఘాల పిలుపుమేరకు కరీంనగర్ (Karimnagar) లోని కమాన్ చౌరస్తా వద్ద ఏఐటీయూసీ, టీయూసీఐ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రైతు, కార్మిక వ్యతిరేక చట్టాల కాపీలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీరాష్ట్ర కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య, టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జిందం ప్రసాద్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కోయడ సృజన కుమార్ మాట్లాడారు.
కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడానికి వాణిజ్య ఒప్పందాలను చేస్తుందని విమర్శించారు. దేశానికి వెన్నెముక రైతు అని చెప్పినటువంటి కేంద్రం, నేడు రైతుకి గిట్టుబాటు ధర లేకుండా, సబ్సిడీ రుణాలు ఇవ్వకుండా, విత్తనాలు అధిక రేట్లు పెంచుతూ, యూరియా రేట్లు రెట్టింపు చేస్తూ మోసం చేస్తుందని ధ్వజమెత్తారు. ఆరుగాలం పంట పండించే రైతుకు గిట్టు గిట్టుబాటు ధర కల్పించకుండా మధ్య దళారీలు దోపిడీ చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు.
జాతీయ ఉపాధి హామీ పథకం 100 రోజులు నుండి 200 రోజులకు పెంచాలని, రోజువారీ కూలీ 700 ఇవ్వాలని ఒకవైపు ఆందోళన చేస్తుంటే.. ఉన్న పథకాన్ని రద్దుచేసి రామ్ జీ పథకం పేరుతో ప్రభుత్వం కుట్ర చేస్తుందని దీనిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సవరణ 2025 చట్టం రద్దు, పంటకి గిట్టుబాటు ధర చట్టం చేయాలని, రుణమాఫీ, పంటల బీమా అమలు, నాలుగు లేబర్ కోడ్ లను రద్దుతో పాటు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను తక్షణమే రద్దు చేయాలని లేకపోతే పెద్ద ఎత్తున దేశవ్యాప్త ఆందోళనకు పూనుకుంటామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్, సీపీఐ నగర సహాయక కార్యదర్శి పైడిపల్లి రాజు, ఏఐటీయూసీ నగర కార్యదర్శి కిమ్మసారపు నరసయ్య , బొంతల ఎల్లయ్య, దాసరి అనిల్, టీయూసీ నాయకులు ఎస్ కమలాకర్, మునీధర్, శ్రీపతి ప్రసాదులు పాల్గొన్నారు.

