epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

సోనియా పౌరసత్వం ఆరోపణలపై ప్రియాంక గాంధీ కౌంటర్

కలం డెస్క్ : పౌరసత్వం రావడానికి ముందే ఓటర్ల జాబితాలో సోనియాగాంధీ (Sonia Gandhi) పేరు ఉన్నదనే ఆరోపణల్లో నిజం లేదని, పచ్చి అబధ్ధాలని లోక్‌సభ సభ్యురాలు ప్రియాంకాగాంధీ (Priyanka Gandhi) అన్నారు. భారతదేశ పౌరసత్వం తీసుకున్న తర్వాతనే ఆమె తన ఓటు హక్కును వినియోగించుకున్నారని స్పష్టం చేశారు. ప్రస్తుతం సోనియాగాంధీ వయసు 80 సంవత్సరాలని, ఈ దేశ సేవలోనే ఆమె ఉన్నారని తెలిపారు. ఆమెపై చేస్తున్న ఆరోపణలను సీరియస్‌గా పట్టించుకోవాల్సిన అవసరం లేదని, ఆమె కూడా దీని గురించి బాధపడాల్సిన అవసరమూ లేదన్నారు. పౌరస్వతం రావడానికి ముందే ఓటరుగా పేరు నమోదైందని పిటిషనర్ లేవనెత్తిన ఆరోపణలను పరిగణనలోకి తీసుకున్న ఢిల్లీ హైకోర్టు సోనియాగాంధీకి, ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణ జనవరి 6న జరగనున్న నేపథ్యంలో పార్లమెంటు ఆవరణలో ప్రియాంకాగాంధీ పై విధంగా స్పందించారు.

‘సర్’పై చర్చ నేపథ్యంలో సోనియా వివాదం :

బిహార్ ఎన్నికల్లో అర్హులైన లక్షలాది మంది ఓటర్లను జాబితా నుంచి ఎన్నికల సంఘం తొలగించిందని, ఉద్దేశపూర్వకంగానే బీజేపీ వ్యతిరేక ఓటర్లుగా ముద్రపడినవారు ఓటు వేసేందుకు అర్హత కోల్పోయారని రాహుల్‌గాంధీ సహా పలు పార్టీల నేతలు గతంలోనే ఆరోపించారు. ఈ అంశాన్ని బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా ప్రస్తావించిన రాహుల్‌గాంధీ ప్రధాని మోడీని ‘ఓట్ చోర్’ అని విమర్శించారు. కాంగ్రెస్ సహా ఇండియా బ్లాక్ పార్టీల్లోని పలువురు నేతలు ‘ఓట్ చోర్.. గద్దే చోడ్’ అనే స్లోగన్‌ను వైరల్ చేశారు. ఇప్పుడు ‘సర్’ అంశంపై లోక్‌సభలో చర్చ జరుగుతున్న సమయంలోనే ఢిల్లీ హైకోర్టులో సోనియాగాంధీ పౌరస్వతం, ఓటరుగా పేరు నమోదు విషయంలో ఉల్లంఘనలు జరిగాయనే పిటిషన్‌పై విచారణ జరగడం, ఆమెకు నోటీసులు జారీ కావడం గమనార్హం.

ఆధారాలను బైటపెట్టిన బీజేపీ :

ఇటలీ దేశానికి చెందిన సోనియాగాంధీకి 1983 వరకూ ఆ దేశ పౌరసత్వమే ఉన్నదని, భారతదేశ పౌరురాలు కాదని బీజేపీ నేత అనురాగ్ ఠాగూర్ ఆగస్టు 13వ తేదీనే ప్రెస్ మీట్‌లో వ్యాఖ్యానించారు. న్యూ ఢిల్లీ పార్లమెంటు నియోజకవర్గంలోని 145వ నెంబర్ పోలింగ్ బూత్‌లో ఓటరుగా సోనియాగాంధీ పేరు ఉన్నదని (జాబితాలో నెం. 388), అప్పటికి ఆమె వయసు 35 సంవత్సరాలు అని అప్పటి ఇమేజ్‌ను మీడియాకు విడుదల చేశారు. కానీ భారతదేశ పౌరసత్వం ఆమెకు 1983 ఏప్రిల్ 30న మంజూరైందని, అంటే మూడేండ్లకు ముందే ఆమె ఓటరుగా తన పేరును నమోదు చేసుకున్నారని తెలిపారు. 1982 సంవత్సరంలో ఓటర్ల జాబితా నుంచి ఆమె పేరు డిలీట్ అయిందని, తిరిగి పౌరసత్వం వచ్చిన తర్వాత మళ్ళీ నమోదు చేసుకున్నారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు సరిగ్గా ఢిల్లీ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌లోనూ ఇవే అంశాలను పిటిషనర్ ప్రస్తావించారు. ఈ క్రమంలోనే ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) స్పందిస్తూ తన తల్లి భారతదేశ పౌరసత్వం తీసుకున్న తర్వాతనే ఆమె తన ఓటు హక్కును వినియోగించుకున్నారని స్పష్టం చేశారు.

Read Also: రెండోరోజూ పెట్టుబడుల సునామీ.. సూపర్ సక్సెస్ దిశగా గ్లోబల్ సమ్మిట్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>