కలం, వెబ్ డెస్క్: శ్రీలంక తీరంలో ఇరాన్ యుద్ధనౌకపై దాడి జరిగింది. ఈ ఘటనలో 101 మంది గల్లంతయ్యారు. 78 మంది గాయాలతో బయటపడ్డారు. వీళ్లలో 32 మంది స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒకర పరిస్థితి విషమంగా ఉంది. శ్రీలంక నేవీ, రక్షణ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీలంక దక్షిణ తీరంలోని హిందూ మహాసముద్రంలో ఇరాన్ యుద్ధనౌక ఐరిస్ డెనా(IRIS Dena) మునిగిపోతున్నట్లు సమాచారం అందింది. తమను రక్షించమంటూ నౌకలోని సిబ్బంది హెల్ప్ మెసేజ్ పెట్టారు. దీంతో రంగంలోకి దిగిన శ్రీలంక నౌకాదళం హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొంది. అయితే, అప్పటికే 101 మంది సముద్రంలో గల్లంతయ్యారు. మిగిలిన 78 మందిని రక్షించింది. వీళ్లను చికిత్స కోసం గాలె సిటీలోని ఆస్పత్రికి తరలించింది. తమ నౌకపై గుర్తుతెలియని సబ్మెరైన్ దాడి చేసినట్లు ఇరాన్ నేవీ సిబ్బంది తెలిపారు. గల్లంతయిన వాళ్లకోసం శ్రీలంక నావికాదళం సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహిస్తోంది.
కాగా, ఇరాన్ యుద్ధనౌక(IRIS Dena) శ్రీలంక తీరంలో కనిపించడం, దానిపై గుర్తు తెలియని సబ్మెరైన్ దాడి చేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అసలు, ఈ యుద్ధనౌక హిందూ మహాసముద్రంలోకి, అదీ శ్రీలంక తీరంలోకి ఎలా వచ్చిందనేది ప్రధాన ప్రశ్న. ప్రస్తుతం ఇజ్రాయెల్–అమెరికా దళాల దాడులు, ఇరాన్ ప్రతిదాడులతో పశ్చిమాసియాలో యుద్ధం భీకరంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చమురు రవాణాకు ఎంతో కీలకమైన హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. ఈ పరిస్థితుల్లో అక్కడే మాటువేసి ఉన్న అమెరికా నేవీ ఫోర్స్ కళ్లు కప్పి శ్రీలంక తీరం వరకూ ఇరాన్ నౌక రావడం, దానిపై సబ్మెరైన్ దాడికి దిగడం మిస్టరీగా మారింది. మరోవైపు, దీని వెనక ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ మొస్సాద్ ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Read Also: లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత గణపతి..?
Follow Us On: Instagram

