కలం, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మిడిల్ ఈస్ట్‌లో ఉన్న అమెరికా పౌరులకు కీలక సూచనలు చేశారు. తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో చేసిన పోస్టులో “ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ” ప్రారంభమైన తర్వాత ఇప్పటి వరకు 9 వేల మందికి పైగా అమెరికన్లు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారని తెలిపారు. మిడిల్ ఈస్ట్‌లో ఉన్న అమెరికా పౌరులు స్వదేశానికి రావాలనుకుంటే వెంటనే స్టేట్ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్ Step.State.Gov లో నమోదు చేసుకోవాలని సూచించారు. నమోదు చేసుకున్న వారి వివరాల ఆధారంగా వారు ఉన్న ప్రదేశాన్ని గుర్తించి, ప్రయాణ ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు. ఇప్పటికే ఉచితంగా చార్టర్ విమానాలు నడుపుతున్నామని, అలాగే వాణిజ్య విమాన టికెట్లు కూడా బుక్ చేస్తున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో వాణిజ్య విమానాల సంఖ్య మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అత్యవసర సహాయం కోసం అమెరికా పౌరులు 24 గంటల పాటు పనిచేసే స్టేట్ డిపార్ట్‌మెంట్ టాస్క్ ఫోర్స్ నంబర్ +1-202-501-4444 కు కాల్ చేయవచ్చని తెలిపారు. ఇదే విషయాన్ని వైట్ హౌస్ కూడా ఎక్స్ వేదికగా షేర్ చేసింది. మిడిల్ ఈస్ట్‌లో ఉన్న అమెరికా పౌరులు వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని, అలాగే అత్యవసర సహాయం కోసం అదే హెల్ప్‌లైన్ నంబర్‌కు సంప్రదించాలని సూచించింది. ఇరాన్‌తో జరుగుతున్నది యుద్ధం కాదని, సైనిక ఆపరేషన్ అని వైట్ హౌస్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇరాన్‌లో ఉగ్రవాద పాలనను అంతం చేస్తామని వెల్లడించింది.

