epaper
Sunday, March 1, 2026
epaper

న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దెబ్బతీసే కుట్ర : సుప్రీం

కలం, వెబ్​డెస్క్​: ఎనిమిదవ తరగతి పాఠ్యపుస్తకంలోని (NCERT Book) ఓ వివాదాస్పద పాఠ్యాంశంపై సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దెబ్బతీసే కుట్రలో భాగంగానే ఈ పాఠ్యాంశాన్ని చేర్చినట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. దీన్ని క్షమించబోమని, బాధ్యులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని తీవ్రంగా హెచ్చరించింది. వివాదాస్పద పాఠ్యాంశం ఉన్న పుస్తకాన్ని బ్యాన్​ చేసింది. మార్కెట్​లోకి వెళ్లిన ప్రతులను, డిజిటల్​ ప్రింట్​లను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆదేశించింది. ఈ విషయంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించినా కేంద్ర, రాష్ట్రాలపై తీవ్ర చర్యలు తీసుకుంటామని ఘాటు హెచ్చరికలు జారీ చేసింది.

జాతీయ విద్యాపరిశోధన, శిక్షణ మండలి(ఎన్​సీఈఆర్​టీ) 8వ తరగతి పాఠ్యపుస్తకంలో ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ అనే అంశం పాఠంగా చేర్చడంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ సూర్యకాంత్​, జస్టిస్​ జోయ్​మాల్యా బాగ్చీ, జస్టిస్ విపుల్​ ఎం పంచోలితో కూడిన ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. ఈ సంద్భర్భంగా కేంద్రం, ఎన్​సీఈఆర్​టీపై సుప్రీం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి ముందస్తు ప్రణాళికతో చేసిన ప్రయత్నంలా కనిపిస్తోందని పేర్కొంది. దీర్ఘకాలిక ప్రభావం చూపే ఇలాంటి చర్యలు క్రిమినల్ కాంటెంప్ట్ పరిధిలోకి వస్తాయంది.

‘ఈ వ్యవహారంపై లోతైన దర్యాప్తు అవసరం’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇలాంటి విషయాలు అదుపులోకి రాకపోతే ప్రజలకు న్యాయవ్యవస్థపై నమ్మకం దెబ్బతింటుందని హెచ్చరించింది. ఈ క్రమంలో ఎన్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం.. బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని కోరింది (NCERT Book).

ఈ వివాదాస్పద పాఠ్యాంశంపై బుధవారం ఎన్‌సీఈఆర్‌టీ విడుదల చేసిన ప్రకటనపైనా సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. అందులో క్షమాపణ అనే పదం కూడా లేకుండా, తమ చర్యను సమర్థించుకునే ప్రయత్నం చేసినట్లు పేర్కొంది. కాగా, విచారణ ప్రారంభంలో కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్​ మెహతా క్షమాపణలు చెప్పారు. అయినా, సుప్రీం శాంతించలేదు. దీనిపై వివరణ​లు, వాదనలు అనంతరం తదుపరి విచారణను మార్చి 11కి వాయిదా వేసింది.

Read Also : భర్త సీఎం.. భార్య ఎమ్మెల్యే.. అసెంబ్లీలో ప్రశ్నలు..

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!