epaper
Sunday, March 1, 2026
epaper

నల్లగొండలో రూ.193 కోట్ల సీఎంఆర్ స్కామ్.. అయినా మంత్రి ఉత్తమ్ కామ్!!

కలం, నల్లగొండ బ్యూరో : బ్యాంక్ లోను కొట్టు.. రైస్ మిల్లు పెట్టు.. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) పట్టు.. అనే తరహాలో ఉమ్మడి నల్లగొండ జిల్లా (Nalgonda District)లో కొత్త తరహా స్కామ్ మొదలయ్యింది. పేరుకేమో బియ్యం బిల్లు.. ఆ పేరు మీద రూ.కోట్లలో స్కామ్ జరుగుతోంది. ఏటా మిల్లర్లు సీఎంఆర్ బియ్యాన్ని మెక్కేస్తున్నారు. ఆసియా ఖండంలోనే అత్యధికంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రైసు మిల్లులు ఉన్నాయి. అయితే ఆ మిల్లులే ప్రభుత్వ ధనాన్ని కాజేయడంలో కింగ్ మేకర్లు అయ్యాయి. ప్రజలకు అందాల్సిన సీఎంఆర్ బియ్యం పక్కదారి పడుతున్నాయి.

ఐకేపీ, పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం కొన్న ధాన్యాన్ని సీఎంఆర్ గా మార్చి ఇచ్చేందుకు రైస్ మిల్లులకు ఏటా కేటాయిస్తుంటారు. వడ్లను బియ్యంగా మార్చి తిరిగి ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ రైస్ మిల్లర్లు కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం నుంచి తీసుకున్న ధాన్యాన్ని ఏండ్ల తరబడిగా సీఎంఆర్ గా మార్చట్లేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఏటా ఇదే తంతు. అయినా అధికారుల తీరు మాత్రం మారట్లేదు. సాక్షాత్తూ తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత జిల్లాలో మూడేండ్ల క్రితం అక్షరాల రూ.193 కోట్ల సీఎంఆర్ స్కామ్ జరిగింది. అయినా నేటికీ ఆ స్కామ్ అంతు తేల్చట్లేదు అధికారులు.

నల్లగొండ జిల్లాలో స్కామ్ జరిగింది ఈ మిల్లుల్లోనే..

ఉమ్మడి నల్లగొండ (Nalgonda) జిల్లాలో 2022-23 సంవత్సరానికి సంబంధించి పౌరసరఫరాల శాఖ మిల్లర్లకు భారీగా ధాన్యం కేటాయించింది. అయితే అందులో చిట్యాల వరలక్ష్మి పారాబాయిల్డ్, కేతేపల్లి చాముండేశ్వరి, మునుగోడు మురళీ మనోహర్, నల్లగొండలోని రామలక్ష్మణ్, కనక మహాలక్ష్మి, సుమాంజలి, గౌతమి ఇండస్ట్రీస్ సైతం సీఎంఆర్‌గా మార్చి ఇస్తామని కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని తీసుకున్నాయి. కానీ తిరిగి ఇవ్వాల్సిన సీఎంఆర్ బియ్యం మాత్రం పత్తాకు లేవు.

దాదాపు ఏడు మిల్లులు మొత్తం 58,955 మెట్రిక్ టన్నుల ధాన్యం తిరిగివ్వలేదు. ఆ ధాన్యం విలువ అక్షరాల రూ. 193 కోట్లకు పైమాటే. అయితే ఏడాది క్రితం ప్రభుత్వం ఈ ధాన్యాన్ని వేలం వేస్తే.. కొనుగోలుదారులు వెళ్ళి చూస్తే మిల్లుల్లో ధాన్యం మాయమయ్యింది. దీంతో అసలు విషయం బట్టబయలయ్యింది. ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని మర పట్టించిన రైస్ మిల్లర్లు.. బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించకుండా కాకినాడ పోర్టుకు తరలించి అమ్ముకున్నారని అధికారుల ధ్రువీకరణలో తేలింది.

పక్కా ప్లాన్‌తో ఏండ్ల తరబడి దందా..

ఉమ్మడి జిల్లాకు ఇదేం కొత్త వ్యవహారం కాదు. ఏటా ప్రభుత్వం నుంచి ధాన్యం తీసుకోవడం.. దాన్ని ఇతరులకు అమ్ముకోవడం పరిపాటే. కొంతమంది మిల్లర్లు అయితే అసలు లేని ధాన్యానికి ట్రక్ షీట్లు సృష్టించి రూ.కోట్ల స్కామ్ చేసిన ఉదంతాలు జిల్లాలో లేకపోలేదు. మరికొంతమంది మిల్లర్లు ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యాన్ని తక్కువ ధరకు తీసుకొచ్చి.. ప్రభుత్వానికి ఎక్కువ ధరకు అంటిగట్టిన ఘనులు లేకపోలేదు. అయితే రూ.193 కోట్ల స్కామ్ చేసిన ఏడు మిల్లుల యాజమాన్యాలు మూడేండ్లుగా పక్కా ప్లాన్‌తో సీఎంఆర్ ఎగవేతకు ప్లాన్ వేశారు.

అయితే ఈ మిల్లర్ల వెనుక రాజకీయ నేతల అండదండలు ఉండడం గమనార్హం. పొలిటికల్ లీడర్లకు బినామీలుగా మారి.. రూ.193 కోట్లను మాయం చేశారు. ఇలా స్వాహా చేసిన సొమ్మును హైదరాబాద్‌ మహానగరంతో పాటు ఇతర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లలో పెట్టుబడులు పెట్టడం.. సినిమాల్లో ఇన్వెస్ట్ చేయడం.. స్థిరాస్థులను మార్టిగేజ్ చేసుకుని అధిక వడ్డీలకు తిప్పడం.. తదితర మార్గాల్లో భారీగా సొమ్ము చేసుకున్నారు. ప్రభుత్వానికి మాత్రం నేటికీ నయా పైసా చెల్లించలేదు. అయితే ఈ వ్యవహారంపై నాన్‌బెయిలబుల్ కేసులు పెట్టామని అధికారులు చెబుతున్నారు. కానీ ధాన్యం రికవరీ సంగతి మర్చిపోయారు. ఇంత జరుగుతున్నా.. మంత్రి ఉత్తమ్ (Minister Uttam Kumar) మాత్రం మౌనం వహించడం వెనుక ఆంతర్యం ఏంటో అర్థం కావట్లేదు. రెవెన్యూ రికవరీ యాక్ట్ కాగితాలకే పరిమిత మైందా..? ప్రభుత్వ సొమ్ము అంటే లెక్కలేకుండా పోయిందా..? వాటాలిస్తే.. అధికారులు, ప్రజాప్రతినిధులకు స్కామ్‌ల సంగతి పట్టదా..? అన్న ప్రశ్నలు సామాన్యుల్లో లేకపోలేదు.

Read Also:  అనిల్ అంబానీకి బిగ్ షాక్.. రూ. 3,716 కోట్ల లగ్జరీ ప్రాపర్టీ సీజ్

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!