కలం, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ కాలేజీల్లో ఆర్కిటెక్చర్, ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్ (JEE Main 2026) పేపర్ 2 ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. పేపర్–2ఏ (బీఆర్క్)లో ఒకరు, పేపర్–2బి(బీప్లానింగ్)లో ఒకరు 100 పర్సంటైల్ సాధించారు. వీళ్లిద్దరూ కేరళకు చెందినవాళ్లే కావడం విశేషం. సూర్యతేజ (బీఆర్క్)లో, గౌరీ శంకర్(బీప్లానింగ్)లో వంద శాతం పర్సంటైల్ సాధించి టాప్ ర్యాంకులో నిలిచారు. ఇక ఈ రెండు పేపర్లలో సత్తా చాటిన తెలుగువాళ్లు ఎవరంటే…
పేపర్–2ఏలో తెలంగాణకు చెందిన తేళ్లూరి శ్రేయస్ రెడ్డి(99.993) జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు పొందాడు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఓరుగంటి సూర్య అశ్విన్ (99.95) 10వ స్థానంలో నిలిచాడు. పేపర్–2బిలో మద్దూరి నాగ ప్రద్యుమ్న రెడ్డి(తెలంగాణ– 99.990) 4వ ర్యాంక్ సాధించగా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పైలా హర్షాదిత్య, వానపల్లి శ్రీ ఈశ్వర్ రాజ్, సింగంశెట్టి వెంకట భీమతులిప్ వరుసగా 8,9,10 స్థానాల్లో నిలిచారు.
జనరల్ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ససనపురి తోషిణి (99.936) టాప్ ర్యాంక్ పొందారు. అలాగే ఎస్టీ, దివ్యాంగ కేటగిరీల్లో ఏపీకి చెందిన కుంభా జీవన్ సాయిరామ్ (99.776), బలగం ఆదిత్య వీర విజయ భార్గవ్(95.390) మొదటి స్థానంలో నిలిచారు.
ఈ ఏడాది జనవరిలో జేఈఈ మెయిన్ (JEE Main 2026) పరీక్షలు జరిగాయి. ఇందులో జేఈఈ మెయిన్ పేపర్1 ఫలితాలు ఇప్పటికే రిలీజయ్యాయి. ప్రస్తుతం విడుదలైనవి జేఈఈ మెయిన్ పేపర్2 పరీక్షలు. జనవరి 29న రెండు పేపర్లుగా(బీఆర్క్–పేపర్ 2ఎ), (బీప్లానింగ్–పేపర్ 2బి) జరిగిన ఈ పరీక్షకు మొత్తం 1,63,671 మంది హాజరయ్యారు.
పూర్తి ఫలితాలు, అదనపు వివరాలు https://jeemain.nta.nic.in/ వెబ్సైట్లో చూడవచ్చు.

