కలం, వెబ్ డెస్క్: దేశ రాజధానిలో జరుగుతున్న ఇండియా ఇంపాక్ట్ ఏఐ సమ్మిట్ వేదికగా భారత్ మరో వ్యూహాత్మక కూటమిలోకి చేరింది. కీలక ఖనిజాలు, కృత్రిమ మేధస్సు(ఏఐ)లో స్థిరమైన సప్లయ్ చైన్ ఏర్పాటుకు పనిచేసే ‘పాక్స్ సిలికా’లోకి (Pax Silica ) శుక్రవారం అధికారికంగా చేరింది. ఇది అమెరికా నేతృత్వంలో పనిచేస్తుంది. భారత ప్రభుత్వం తరఫున కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఒప్పందంపై సంతకం చేశారు. ‘పాక్స్ సిలికా’ బృందం, అమెరికా ఆర్థిక వ్యవహారాల ఉప విదేశాంగ కార్యదర్శి జేకబ్ హెల్బర్గ్, భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ తదితరులు ఉన్నారు.
భారత్, అమెరికా మధ్య ఇటీవలే వాణిజ్య ఒప్పందం(ట్రేడ్ డీల్) జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రెండు దేశాల మధ్య ఆర్థిక, వ్యాపార సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.
పాక్స్ సిలికా ఏం చేస్తుందంటే..
భవిష్యత్తుల్లో అత్యంత ముఖ్యమైనవిగా మారే కీలక ఖనిజాలు, ఏఐ రంగాల్లో సురక్షితమైన, స్థిరమైన, ఆవిష్కరణ ఆధారిత సరఫరా వ్యవస్థ ఏర్పాటుకు ‘పాక్స్ సిలికా’ను (Pax Silica ) ప్రారంభించారు. గత డిసెంబర్ 12న అమెరికా రాజధాని వాషింగ్టన్లో ఇది ప్రారంభమైంది. కీలక ఖనిజాల ముడి పదార్థాల నుంచి సెమీ కండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మౌలిక సదుపాయాల వరకు సప్లయ్ చైన్‌లో ఆర్థిక, సాంకేతిక సహకారాన్ని ఈ కూటమి పర్యవేక్షిస్తుంది. దీని ద్వారా పరస్పర అభివృద్ధి, భద్రతకు కట్టుబడి ఉండేందుకు తీర్మానించింది. ఈ కూటమిలో ప్రస్తుతం ఆస్ట్రేలియా, గ్రీస్, ఇజ్రాయెల్, జపాన్, ఖతార్, దక్షిణ కొరియా, సింగపూర్, యుఏఈ, యూకే ఉన్నాయి. ఇందులో చేరాలని గత నెలలో భారత్‌ను సెర్గియో గోర్ ఆహ్వానించారు.
ఈ కూటమిలో చేరడంతో భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక సహకారం మరింత బలోపేతం కానుంది. ముఖ్యంగా సెమీ కండక్టర్లు, చిప్స్‌ల తయారీలో ఉపయోగించే కీలక ఖనిజాలు, కృత్రిమ మేధ రంగాల్లో రెండు దేశాల మధ్య భాగస్వామ్యం పెరుగుతుంది. కాగా, ప్రపంచానికి ఏఐ హబ్‌గా భారత్‌ను మార్చాలనే కేంద్ర ప్రభుత్వ సంకల్పానికి ఇది తోడ్పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.


