epaper
Monday, February 23, 2026
epaper

పెట్టుబడుల్లో బంగారం ప్రాధాన్య‌త‌ సుస్థిరం.. కారణం ఏంటో?

క‌లం, వెబ్ డెస్క్‌: పెట్టుబడులంటే (Investments) రిస్క్ అనే భావన ఇప్పటికీ చాలామందిలో ఉంది. స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గులు, క్రిప్టో అస్థిరత చూసి యువ పెట్టుబడిదారులు కూడా కొంత వెనుకంజ వేస్తున్నారు. అయితే పెట్టుబడి అనగానే మాత్రం చాలామంది బంగారం (Gold) వైపే మొగ్గు చూపుతున్నారు. కొత్త పెట్టుబడి మార్గాలు వచ్చినా, భద్రత, స్థిరత్వం కోసం బంగారం ఇప్పటికీ నమ్మకమైన ఆస్తిగానే నిలుస్తోందని నిపుణులు చెబుతున్నారు.

భద్రతకు ప్రతీక

భారతీయ కుటుంబాల్లో బంగారానికి ప్రత్యేక స్థానం ఉంది. పండగలు వచ్చినా, పెళ్లి, పేరంటం అయినా బంగారం కొనుగోలు చేయడం ఇక్కడ వారికి ఒక సంప్రదాయంలా మారింది. అంతేకాకుండా బంగారం కొనుగోలు భారతీయులు కేవలం ఆభరణాల కొనుగోలుగానే కాకుండా.. పెట్టుబడిగా కూడా చూస్తారు. అందుకే తరతరాలుగా బంగారం పెట్టుబడి, డబ్బు భద్రతకు చిహ్నంగా భావించబడుతోంది. ఇది కేవలం ఆభరణం కాదు, అవసర సమయంలో ఆర్థిక ఆధారం కూడా. ఇప్పుడు యువత స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టో వంటి పెట్టుబడుల వైపు వెళ్తున్నా, బంగారం ప్రాధాన్యం మాత్రం తగ్గలేదని చెబుతున్నారు. కరొనా మహమ్మారి, ఉద్యోగ అస్థిరత, పెరుగుతున్న ద్రవ్యోల్బణం వంటి పరిస్థితులు చూసిన కొత్త తరానికి బంగారం భద్రతా ఆస్తిగా మారింది. భారీ లాభాల కంటే మానసిక ప్రశాంతత ఇస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.

ద్రవ్యోల్బణానికి రక్షణ

ఇంధనం, కిరాణా, అద్దెల ధరలు పెరుగుతున్న సమయంలో డబ్బు విలువ తగ్గినా, బంగారం దీర్ఘకాలంలో తన విలువ నిలబెట్టుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. ధరలు పెరిగే కొద్దీ బంగారం విలువ కూడా పెరిగే అవకాశం ఉంటుందని, దీర్ఘకాల ప్రణాళికలో ఇది ఉపయోగపడుతుందని వివరించారు.

పెట్టుబడుల్లో సమతుల్యత

త్వరగా లాభాలు రావాలనే ఉద్దేశంతో చాలా మంది యువ పెట్టుబడిదారులు స్టాక్స్ లేదా క్రిప్టోలో పెట్టుబడులు పెడుతున్నారు. కానీ ఈ మార్కెట్లు వేగంగా మారుతుండటంతో ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో బంగారం కొంత స్థిరత్వం ఇస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. డైవర్సిఫికేషన్ అవసరం గురించి కూడా నిపుణులు చెబుతున్నారు. మొత్తం డబ్బు ఒకే పెట్టుబడిలో పెట్టకుండా వేర్వేరు ఆస్తుల్లో పెట్టడం మంచిదని సూచిస్తున్నారు. స్టాక్ మార్కెట్ పడిపోయిన సమయంలో కూడా బంగారం నిలకడగా ఉండటం వల్ల పెట్టుబడికి సమతుల్యత వస్తుందని చెబుతున్నారు.

బంగారం కొనుగోలులో కొత్త మార్గాలు

గతంలో బంగారం కొనాలంటే నగల దుకాణానికి వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు గోల్డ్ ఈటీఎఫ్‌ (gold ETF)ల ద్వారా షేర్లలా కొనుగోలు చేసే అవకాశం ఉంది. అలాగే డిజిటల్ గోల్డ్ ద్వారా చిన్న మొత్తాలతో కూడా పెట్టుబడి ప్రారంభించవచ్చు. రూ.10 లేదా రూ.50తో కూడా మొదలుపెట్టే అవకాశం ఉందని చెబుతున్నారు.

అత్యవసర సమయంలో ఆర్థిక ఆధారం

అత్యవసర పరిస్థితుల్లో బంగారం ఆర్థికంగా తోడ్పడుతుంది. ఉద్యోగ అనిశ్చితి లేదా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు బంగారం ఆధారంగా రుణాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముత్తూట్ ఎక్సిమ్ సమాచారం ప్రకారం, బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు తక్కువ పత్రాలతోనే గోల్డ్ లోన్లు అందిస్తున్నాయి. మహమ్మారి సమయంలో చాలామంది బంగారం ఆధారంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు.

భవిష్యత్ విలువ

బంగారానికి భావోద్వేగ విలువ కూడా ఉంది. తరతరాలుగా బంగారం వారసత్వంగా అందుతుండటం వల్ల దీనికి ప్రత్యేక స్థానం ఉంది. పెళ్లిళ్లు, పండుగలు వంటి సందర్భాల్లో బంగారం అవసరం ఉండటం వల్ల డిమాండ్ కొనసాగుతూనే ఉంటుంది. పెళ్లి, ఇల్లు కొనుగోలు లేదా పిల్లల చదువు వంటి భవిష్యత్ లక్ష్యాల కోసం కూడా బంగారం ఉపయోగపడుతుంది.

ఎంత బంగారం పెట్టుబడి పెట్టాలి?

పెట్టుబడిలో 5 నుంచి 15 శాతం వరకు బంగారం ఉంచాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఈ పరిమితిలో పెట్టుబడి పెడితే స్థిరత్వం వస్తుందని చెబుతున్నారు. బంగారం ఒక్కటే సంపద పెంచకపోయినా, ప్రణాళికను భద్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో బంగారం ప్రాధాన్యం తగ్గదని నిపుణులు భావిస్తున్నారు. భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య విభేదాలు వంటి పరిస్థితుల్లో బంగారం సురక్షిత పెట్టుబడిగా నిలుస్తుందని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే, కొత్త పెట్టుబడి మార్గాలు పెరిగినా బంగారం స్థానం మాత్రం మారలేదు. భద్రత, స్థిరత్వం, అత్యవసర అవసరాల కోసం బంగారం ఇంకా కీలక ఆస్తిగానే కొనసాగుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>