కలం, వెబ్ డెస్క్ : బరువు తగ్గాలని చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది తరుచుగా బరువును చెక్ చేసుకుంటూ ఉంటారు. కానీ బరువు చెక్ చేసుకున్న ప్రతిసారీ ఫలితాలు వేరేలా ఉంటాయి. కొన్ని సార్లు బరువు తగ్గినట్లు కనిపించినా ఇంకోసారి బరువులో ఎటువంటి మార్పు ఉండదు. మన బరువులో ఈ మార్పులు ఎందుకు వస్తున్నాయి? అన్నది అర్థం కాక చాలా మంది నిరుత్సాహ పడుతుంటారు. అయితే నిపుణులు మాత్రం వేరేలా చెప్తున్నారు. బరువును ఎప్పుడు పడితే అప్పుడు చూసుకుంటే రిజల్ట్స్ అలానే ఉంటాయని, బరువు చూసుకోవడానికి కూడా ఒక సమయం (Best Time to Weigh)అనేది ఉంటుందని అంటున్నారు.
స్కేల్‌తో బరువు చెక్ చేయడం సులభం..
ఉదయం చూసిన బరువు ఒకలా, సాయంత్రం మరోలా ఉండటానికి కారణాలేమిటి? అసలు నిజమైన శరీర బరువు ఎప్పుడు తెలుస్తుంది? అనే ప్రశ్నలకు ఆరోగ్య నిపుణులు స్పష్టత ఇచ్చారు. ఇంట్లో స్కేల్‌తో బరువు చెక్ చేయడం సులభమే. అయితే కొలిచే సమయం బరువు సంఖ్యపై పెద్ద ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. శరీర బరువు రోజంతా మారుతూ ఉంటుందని తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సుమారు 1 నుంచి 2.7 కిలోల వరకు తేడా రావడం సహజమని వివరించారు. దీనికి నీటి నిల్వ, తిన్న ఆహారం, మల విసర్జన వంటివి ప్రధాన కారణాలుగా వివరించారు.
ఉదయం బరువు కొలిస్తే తక్కువగా కనిపించడానికి కారణం ఉందని నిపుణులు చెప్పారు. రాత్రి సమయంలో ఆహారం జీర్ణమై శరీరం తేలికగా మారుతుందని వివరించారు. అందుకే నిద్రలేచిన వెంటనే, మూత్ర విసర్జన పూర్తయ్యాక, ఏమీ తినకముందే బరువు కొలవడం ద్వారా నిజమైన బరువు తెలుస్తుందని సూచించారు. ఈ సమయాన్ని స్థిరమైన ప్రామాణిక బరువుగా తీసుకోవచ్చని తెలిపారు.
అదే సాయంత్రం లేదా రాత్రి బరువు కొలిస్తే సంఖ్య ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుందని చెప్పారు. రోజంతా తిన్న ఆహారం, తాగిన నీరు, శరీరంలో నిల్వ అయిన ద్రవాలు బరువును పెంచి చూపుతాయని వివరించారు. దీనర్థం ఫ్యాట్ పెరిగినట్లు కాదని స్పష్టం చేశారు. ఇవన్నీ తాత్కాలిక మార్పులే అని తెలిపారు.
బరువు మారడానికి ఇతర కారణాలు కూడా ఉన్నాయని నిపుణులు వివరించారు. ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల శరీరం నీటిని నిల్వ చేసుకుంటుందని చెప్పారు. కార్బోహైడ్రేట్లు అధికంగా ఉన్న ఆహారం కూడా ఇదే ప్రభావం చూపుతుందని వివరించారు. జీర్ణం కాకుండా ఉన్న ఆహారం తాత్కాలికంగా బరువు పెరిగినట్టు చూపుతుందని తెలిపారు. హార్మోన్ల మార్పులు కూడా బరువు సంఖ్యపై ప్రభావం చూపుతాయని చెప్పారు.
బరువును సరిగా గమనించాలంటే ఒక పద్ధతి పాటించాలని నిపుణులు సూచించారు. ఎప్పుడూ ఒకే సమయాన్ని (Best Time to Weigh) ఎంచుకోవాలని చెప్పారు. ముఖ్యంగా ఉదయం కొలవడం మంచిదని సూచించారు. ప్రతిరోజూ బరువు చూడకుండా వారానికి ఒకసారి మాత్రమే కొలిస్తే నిజమైన మార్పు అర్థమవుతుందని తెలిపారు. ఒకే స్కేల్, ఒకే స్థలం, ఒకే విధానం కొనసాగించాలని సూచించారు.
చివరగా నిపుణులు ఒక విషయం గుర్తు చేశారు. బరువు స్కేల్ మాత్రమే ఆరోగ్యాన్ని పూర్తిగా చెప్పలేదని తెలిపారు. శరీర దృఢత్వం, ఫ్యాట్ శాతం, ఆహారపు అలవాట్లు, వ్యాయామం వంటి అంశాలు కూడా ముఖ్యం అని చెప్పారు. క్రమబద్ధంగా బరువును గమనించడం ఆరోగ్య ప్రయాణానికి సహాయకరంగా ఉంటుందని తెలిపారు.
Read Also: నిద్రలేమితో వ్యాధుల ముప్పే.. లేటెస్ట్ స్టడీలో షాకింగ్ విషయాలు
Follow Us On: Sharechat


