కలం, వెబ్‌డెస్క్: మున్సిపల్ ఎన్నికల్లో పోటీపై తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపోల్స్‌లో ఆల్ ఇండియా ఫార్వర్డ్‌బ్లాక్ గుర్తుపై పోటీ చేయనుంది. తెలంగాణ జాగృతి ఔత్సాహిక అభ్యర్థులు ఫార్వర్డ్‌బ్లాక్ సింబల్ అయిన సింహం గుర్తుపై బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సమక్షంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్‌బ్లాక్(ఏఐఎఫ్బీ) తెలంగాణ రాష్ట్ర చైర్మన్ జావెద్ లతీఫ్, ఉపాధ్యక్షులు కె.బుచ్చిరెడ్డి, కన్వీనర్ జోజిరెడ్డి ప్రకటించారు.
బుధవారం హైదరాబాద్‌లోని ఫార్వర్డ్‌బ్లాక్ కార్యాలయంలో కవితతో ఫార్వర్డ్‌బ్లాక్ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికలతోపాటు భవిష్యత్తులోనూ జాగృతి, ఫార్వర్డ్‌బ్లాక్ కలసి పనిచేయాలని తీర్మానించారు. దీనిపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా, మున్సిపల్ ఎన్నికల్లో ఫార్వర్డ్‌బ్లాక్ సింహం గుర్తుపై తెలంగాణ జాగృతి అభ్యర్థులు పోటీ చేయనున్నట్లు ‘కలం’ ఈ నెల 24నే చెప్పింది.
తెలంగాణ జాగృతి (Telangana Jagruthi), ఫార్వర్డ్‌బ్లాక్ సమావేశంలో AIFB సెంట్రల్ కమిటీ సభ్యులు ఆర్.వీ.ఆర్. ప్రసాద్, తేజ్ దీప్ రెడ్డి, కొండ దయానంద్, ప్రధాన కార్యదర్శి కోమటిరెడ్డి తేజ్ దీప్ రెడ్డి, ఫైనాన్స్ సెక్రటరీ కె.నరేందర్, నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు గౌడ్, సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి బీరన్న, నల్గొండ ప్రధాన కార్యదర్శి రాము, ఐవైఎల్ స్టేట్ ప్రెసిడెంట్ ఆదిత్య, జనరల్ సెక్రటరీ కృష్ణమూర్తి సహా ముఖ్య నేతలు పాల్గొన్నారు.


