కలం, వెబ్ డెస్క్: విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి(Ajit Pawar Death) చెందడంపై దేశ వ్యాప్తంగా ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ(PM MODI), రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు, రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా అజిత్ పవార్(Ajit Pawar)కు నివాళి అర్పించారు. విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌తో పాటు అనేక మంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. అజిత్ పవార్ అకాల మరణం తీవ్రంగా కలచివేసిందన్నారు. ఆయన మహారాష్ట్ర అభివృద్ధిలో, ముఖ్యంగా సహకార రంగంలో చేసిన విశేష సేవలు ఎప్పటికీ మరిచిపోలేమన్నారు. వారి కుటుంబానికి, అభిమానులకు సంతాపం తెలిపారు. ఈ ప్రమాదంలో మరణించిన ఇతరుల కుటుంబాలకు కూడా ఈ బాధను భరించేందుకు దేవుడు శక్తి అందించాలని ప్రార్థించారు.
“అజిత్ పవార్ ప్రజలతో విడదీయ రాని అనుబంధం ఏర్పరచుకున్న నాయకుడు. మహారాష్ట్ర ప్రజల సేవలో ముందుండే వ్యక్తిగా, ప్రజల కోసం కష్టపడే వ్యక్తిగా ఆయనపై ఎంతో గౌరవం ఉంది. ఆయనకు ఉన్న పరిపాలన అనుభవం చాలా గొప్పది. ఆయన అకాల మరణం చాలా బాధాకరం. వారి కుటుంబానికి, అభిమానులకు నా సానుభూతి. ఓం శాంతి.” అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఎన్డీఏలో సీనియర్ సహచరుడు అజిత్ పవార్ అకస్మాత్తుగా మృతి చెందడం తీవ్రంగా కలిచి వేసిందని హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. అజిత్ పవార్ 33 ఏళ్ల రాజకీయ జీవితంలో మహారాష్ట్రలో ప్రతి వర్గం సంక్షేమానికి అంకితభావంతో పని చేశారన్నారు. ఆయనతో సమావేశం అయ్యే ప్రతీసారి ప్రజల సంక్షేమ అంశాలపై విస్తృతంగా చర్చించేవారని గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం ఎన్డీఏ కుటుంబంతో పాటు, తనకు వ్యక్తిగతంగా ఎంతో తీవ్ర నష్టమని తెలిపారు. పవార్ కుటుంబానికి సానుభూతి తెలుపుతూ, దేవుడు పవార్ ఆత్మకు శాంతి కలిగించాలని తన పోస్టులో పేర్కొన్నారు.
మరోవైపు పవార్ మృతి పట్ల పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విమాన ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు, ఆయన వెంట ఉన్న వారు అకస్మాత్తుగా మృతి చెందడం ఎంతో కలచివేసిందన్నారు. అజిత్ కుటుంబ సభ్యులకు, శరద్ పవార్‌కు, అజిత్ స్నేహితులు, అభిమానులకు హృదయపూర్వక సానుభూతి తెలిపారు. ఈ ఘటనపై సరైన దర్యాప్తు జరగాలని కోరారు. అజిత్ పవార్ తన జీవితమంతా మహారాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి అంకితభావంతో పని చేశారని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ప్రజల పట్ల ఆయన చూపిన దయ, ప్రజాసేవలో ఆయన నిస్వార్థం ప్రతి ఒక్కరూ గుర్తించారన్నారు.
ఆయన కుటుంబానికి, అభిమానులకు సంతాపం తెలిపారు. అజిత్ పవార్ విమాన ప్రమాదం గురించి తెలియగానే చాలా బాధపడ్డానని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వెల్లడించారు. ఆయన మృతి మహారాష్ట్ర రాజకీయాలకు, ప్రజాసేవకు భారీ నష్టమని అభిప్రాయపడ్డారు. ఈ బాధాకర సమయంలో పవార్ కుటుంబసభ్యులకు, సన్నిహితులకు భగవంతుడు ధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. అజిత్ పవార్ మరణ వార్త విని తీవ్ర ఆవేదనకు గురైనట్లు ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఆయన కుటుంబం, స్నేహితులు, అభిమానులకు సానుభూతి వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అజిత్ పవార్ మృతిపై (Ajit Pawar Death) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈరోజు విమాన ప్రమాదంలో అజిత్ పవార్ సహా మరో ఐదుగురు మృతి చెందారని తెలిసి ఎంతో బాధపడ్డానన్నారు. ఈ దుఃఖ సమయంలో మహారాష్ట్ర ప్రజలకు అండగా ఉంటామన్నారు. పవార్ కుటుంబానికి, సన్నిహితులకు సానుభూతి తెలియజేశారు. ఈ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. అజిత్ పవార్ మహారాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం చేసిన సేవలు ఎప్పుడూ గుర్తుండిపోతాయన్నారు.
Read Also: అజిత్ పవార్ విమాన ప్రమాదానికి కారణమిదే..!
Follow Us On: X(Twitter)


