కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని బోడుప్పల్(Boduppal)లో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) చోటు చేసుకుంది. ఓ కారు వేగంగా వెళ్తూ ఫ్లై ఓవర్ పిల్లర్‌ను ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే.. బుధవారం తెల్లవారుజామున ఎనిమిది మంది ఇంజినీరింగ్ విద్యార్థులు కారులో బోడుప్పల్(Boduppal) నుంచి పోచారం వెళ్తున్నారు. ఈ క్రమంలో మార్గ మధ్యలో వీరి కారు అతి వేగంతో ఫై ఓవర్ పిల్లర్‌ను ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న వారిలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. జేసీబీ సాయంతో కారులో చిక్కుకున్న యువకులను బయటకు తీశారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మృతి చెందిన యువకులను వనపర్తికి చెందిన సాయివరుణ్, నిఖిల్‌గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించి, గాయపడ్డ వారిని చికిత్స కోసం సమీప ఆస్పత్రులకు తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు వెల్లడించారు.


