కలం, వెబ్ డెస్క్ : టీ20 వరల్డ్‌కప్ 2026 (T20 World Cup – 2026) కు ముందు ఐసీసీ తీసుకున్న తాజా నిర్ణయం బంగ్లాదేశ్‌లో పెద్ద దుమారం రేపింది. టోర్నీని ప్రత్యక్షంగా కవర్ చేయాలనుకున్న బంగ్లాదేశ్ జర్నలిస్టుల అక్రెడిటేషన్ దరఖాస్తులను ఐసీసీ పూర్తిగా తిరస్కరించింది. దీని వల్ల అక్కడి మీడియాకు స్టేడియం లెవెల్ కవరేజ్ దూరమైంది. ఇప్పటికే ఐసీసీ, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మధ్య ఉన్న ఉద్రిక్తతల క్రమంలో తాజా పరిణామం కీలక చర్చలకు దారితీస్తోంది. భద్రతా కారణాలు చెబుతూ బంగ్లాదేశ్ జట్టు భారత్‌కు వెళ్లేందుకు నిరాకరించడంతో, వరల్డ్ కప్ (T20 World Cup) లో వారి స్థానాన్ని స్కాట్లాండ్ భర్తీ చేసిన సంగతి తెలిసిందే.
ఈ విషయాన్ని సోమవారం బీసీబీ మీడియా కమిటీ చైర్మన్ అమ్‌జాద్ హుస్సేన్ అధికారికంగా వెల్లడించారు. ఈసారి దాదాపు 130 నుంచి 150 మంది జర్నలిస్టులు అక్రెడిటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ, ఒక్కరికీ కూడా అనుమతి రాలేదని ఆయన తెలిపారు. ఇదే సమయంలో మరో వివాదం తెరపైకి వచ్చింది. కొందరు జర్నలిస్టులకు మొదట అక్రెడిటేషన్ ఆమోదం తెలిపే మెయిల్స్ వచ్చాయని, కొద్ది రోజులకు అదే దరఖాస్తు తిరస్కరించబడిందని సమాచారం అందిందని తెలిసింది. జనవరి మధ్యలో వీసా సపోర్ట్ లెటర్లు పొందిన కొంతమంది ఫోటో జర్నలిస్టులు కూడా చివరికి నిరాశ చెందాల్సి వచ్చింది.
ఈ పరిణామాల్లో స్థానిక జర్నలిస్టు మిర్ ఫరీద్ పేరు కూడా ఉంది. జనవరి 20న ఐసీసీ మీడియా విభాగం నుంచి అప్రూవల్ మెయిల్ వచ్చిందని, అనంతరం మరో మెయిల్‌లో దరఖాస్తు తిరస్కరణ సమాచారం చేరిందని ఆయన తెలిపారు. 1999 నుంచి బంగ్లాదేశ్ వరల్డ్ కప్ ప్రయాణం మొదలైనప్పటి నుంచి, జట్టు పాల్గొన్నా లేకపోయినా అక్కడి జర్నలిస్టులు ఐసీసీ టోర్నీలను క్రమం తప్పకుండా కవర్ చేస్తూ వస్తున్నారు. అలాంటి నేపథ్యం ఉన్నప్పటికీ ఈసారి అందరికీ తిరస్కరణ ఎదురవడం అనేక ప్రశ్నలకు దారి తీస్తోంది.
సీనియర్ జర్నలిస్టు అరిఫుర్ రహ్మాన్ బాబు ఈ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అసోసియేట్ మెంబర్ దేశాల మీడియాకు సాధారణంగా అక్రెడిటేషన్ లభిస్తుందని గుర్తు చేస్తూ, ఈ నిర్ణయం ఆశ్చర్యం కలిగించిందని వ్యాఖ్యానించారు. ఈ అంశంపై బంగ్లాదేశ్ స్పోర్ట్స్ జర్నలిస్టుల సంఘాలు పరస్పరం చర్చించి, సమిష్టి స్పందనపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. సహ ఆతిథ్య దేశమైన శ్రీలంకలో అయినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయవచ్చన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది.


