కలం, డెస్క్ : కల్తీ నెయ్యి కేసు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ ఈ కేసులో ఫైనల్ ఛార్జ్ షీట్ ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తిరుమలకు 60 లక్షల కిలోలకు పైగా కల్తీ నెయ్యిని (Adulterated Ghee Case) బోలేబాబా డెయిరీ సరఫరా చేసిందని తేల్చింది. ఇందులో 24 మందిని నిందితులుగా చేర్చగా.. మరో 12 మంది పాత్ర కూడా ఉన్నట్టు సిట్ అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ ఛార్జ్ షీట్ దాఖలు మీద వైసీపీ నేతలు, కూటమి నేతలు పరస్పర వాదనలకు దిగుతున్నారు. సిట్ విచారణకంటే ముందే సీఎం చంద్రబాబు, కూటమి నేతలు తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యిని వాడారని ఆరోపించారని.. ఇప్పుడు అలాంటివేమీ లేవని తేలిందని వైసీపీ నేతలు అంటున్నారు. కూటమి ప్రభుత్వం జంతువుల కొవ్వు అంటూ తప్పుడు ఆరోపణలు చేసిందని.. దానిపై క్షమాపణలు చెప్పాలంటూ వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
కూటమి అలా..
అయితే కూటమి నేతలు మొదట్లో తిరుమల లడ్డూలో జంతవులు కొవ్వు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసినా.. అలాంటివేమీ లేవని సిట్ విచారణలో తేలిపోయింది. పామాయిల్ తో పాటు కెమికల్ తో నెయ్యిని (Adulterated Ghee Case) తయారు చేసి బోలేబాబా డెయిరీ సరఫరా చేసిందని విచారణలో తేలడంతో.. కూటమి డైలమాలో పడిపోయింది. దాన్ని డిఫెండ్ చేసుకోడానికి.. అసలు పాలే లేని కల్తీ నెయ్యిని తెచ్చి లడ్డూలో కలిపేశారంటూ కూటమి చెబుతోంది. జంతువుల కొవ్వు మాట ఎత్తకుండా కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేయించి పెద్ద నేరం చేశారంటూ కూటమి వాదిస్తోంది.
రాజకీయ నేతల పేర్లు లేకపోవడంతో..
అటు వైసీపీ నేతలు కల్తీ నెయ్యి పేరెత్తట్లేదు. ఇటు కూటమి నేతలు జంతువుల కొవ్వు పేరెత్తట్లేదు. ఇలా అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధమే సాగుతోంది. వైసీపీ నేతల మీదనే కూటమి నేతలు గతంలో బలమైన ఆరోపణలు చేశారు. కల్తీ నెయ్యి కేసు ఫైనల్ ఛార్జ్ షీట్ లో రాజకీయ నేతల పేర్లు లేకపోవడంతో కూటమి నేతలు డైలమాలో పడ్డారు. బోలేబాబా ఆర్గానిక్ డెయిరీ నిర్వాహకులు, వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్న అప్పన్నలే ఇందులో ప్రధాన నిందితులుగా ఉన్నారు. సిట్ విచారణలో నెయ్యి కల్తీ జరిగినట్టు తేలినా.. ఇలా ఇరు వర్గాల వాదనలతో రాజకీయ రచ్చ నడుస్తోంది.
Read Also: ఎట్ హోం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు
Follow Us On : WhatsApp


