కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం ప్రజలు ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Minister Tummala) పిలుపునిచ్చారు. నగరం పరిశుభ్రంగా ఉంటే మన ఆరోగ్యాలు బాగుంటాయని, మన సంపద పెరుగుతుందని అన్నారు. శుక్రవారం ఖమ్మం 53వ డివిజన్ లో రూ.3 కోట్ల 98 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు, సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డితో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు.
అనంతరం దివ్యాంగుల సహకార సంస్థ ఆధ్వర్యంలో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 33 మంది దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాలను మంత్రి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మురికి కాల్వలో చెత్త వేయడం ద్వారా నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారి దోమలు పెరిగి ప్రజలు రోగాల బారిన పడుతున్నారన్నారు. నగరంలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టేందుకు ప్రజలు సహకరించాలన్నారు. రాబోయే తరాలకు ఉపయోగపడే విధంగా నగరంలో రహదారుల విస్తరణ పనులు చేపడతామన్నారు.
నగరంలోని ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పించడంతో పాటు వాటిని సరిగ్గా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. దివ్యాంగుల సంక్షేమం కోసం అవసరమైన కార్యక్రమాలను జిల్లాలో కట్టుదిట్టంగా అమలు చేయాలని మంత్రి తుమ్మల (Minister Tummala) సంబంధిత అధికారులను ఆదేశించారు.


