కలం, వెబ్‌డెస్క్: భవిష్యత్ మొత్తం ఏఐ, రోబోలదేనని స్పేస్ ఎక్స్ ఫౌండర్ ఎలాన్ మస్క్ (Elon Musk) అన్నారు. దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్(WEF)కు శుక్రవారం మస్క్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బ్లాక్‌రాక్ సీఈవోతో ఏర్పాటుచేసిన ప్యానెల్ చర్చలో అనేక అంశాల గురించి మాట్లాడారు. భవిష్యత్తులో రోబోలు సమాజాన్ని పూర్తిగా మార్చేస్తాయని మస్క్ అన్నారు. మనుషుల పనిభారం చాలావరకు తగ్గిస్తాయని చెప్పారు. ఒక దశలో రోబోలే మరికొన్ని రోబోలను తయారుచేసే స్థాయికి చేరతాయని, మనుషుకంటే రోబోలే ఎక్కువ సంఖ్యలో ఉంటాయని మస్క్ అంచనా వేశారు.
ప్రతి ఒక్కరూ వృద్ధాప్యంలో ఉన్న తమ తల్లిదండ్రులు, పిల్లలను చూసుకోవడానికి రోబోలు కావాలని కోరుకుంటారని మస్క్ చెప్పారు. వచ్చే ఏడాది చివరి నాటికి టెస్లా రోబోలను మార్కెట్లోకి తెస్తామని, వాటిని ప్రజలకు అమ్ముతామని వెల్లడించారు. ఏఐ గురించి మాట్లాడుతూ.. ఏఐ ఎంతో తెలివైనదని, మరో ఐదేళ్లలో మనుషులను మించిపోతుందని చెప్పారు.
శాంతి కాదు శకలం అని పెట్టాల్సింది.. ‘బోర్డ్ ఆఫ్ పీస్’పై వ్యంగ్యం
డొనాల్డ్ ట్రంప్ తెచ్చిన ‘బోర్డ్ ఆఫ్ పీస్’ గురించి మాట్లాడుతూ.. దానికి శాంతి కాదు శకలం(ముక్క) అని పెట్టాల్సిందని మస్క్ (Elon Musk) ఎగతాళి చేశారు. కాగా, ఇంగ్లీష్‌లో శాంతి, శకలం(ముక్క) అనే అర్థాలకు రెండక్షరాల మార్పుతో వచ్చే ‘పీస్’ అనే పదాన్నే వాడతారు. మస్క్ ఏమన్నారంటే.. ‘పీస్ సమ్మిట్ ఏర్పాటు చేసినట్లు విన్నాను. కానీ అది శాంతి గురించా? లేక గ్రీన్లాండ్ నుంచి ఒక చిన్న ముక్క, వెనెజువెలా నుంచి మరో చిన్న ముక్క గురించా?’ అంటూ సెటైర్ వేశారు. అనంతరం ‘మనకు కావాల్సింది శాంతి మాత్రమే’ అంటూ నవ్వులు పూయించారు. ఇప్పటికే వెనెజువెలాను స్వాధీనంలోకి తీసుకున్న ట్రంప్ ఇప్పుడు గ్రీన్లాండ్ కోసం పాకులాడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మస్క్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
కాగా, ఒకప్పుడు ట్రంప్, మస్క్ అత్యంత సన్నిహితులు. గత అమెరికా ఎన్నికల్లో ట్రంప్‌కు మద్దతుగా మస్క్ ఆన్లైన్లో ప్రచారం సైతం చేశారు. అయితే, ఆ తర్వాత ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తాయి. కొన్ని రోజులు విమర్శించుకున్నారు. అనంతరం క్రమంగా సంబంధాలు మెరుగుపడిన నేపథ్యంలో మళ్లీ ట్రంప్‌ను విమర్శిస్తూ మస్క్ వ్యాఖ్యలు చేయడం విశేషం.
మరోవైపు.. గతంలో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌ను ‘ప్రజలకు జవాబుదారీతనం లేని వేదికని.. ప్రజలు ఎన్నుకోని, ప్రజలకు అవసరం లేని ఒక ప్రపంచ ప్రభుత్వంలాంటిదని’ విమర్శించిన మస్క్.. ఇప్పుడు అదే సదస్సుకు రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది.


