కలం, తెలంగాణ బ్యూరో : ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్‌పై సిట్ అధికారులు ప్రశ్నల (KTR SIT Interrogation) వర్షం కురిపించారు. ఎక్కువగా ట్యాపింగ్ కోసం అనుసరించిన విధానం, అమలుచేసిన మెకానిజం, రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేయడం, పార్టీ అవసరాల కోసం ఫండింగ్ ఒత్తిళ్ళు… ఎక్కువగా ఈ అంశాలపైనే పోలీసులు ఆయనను ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. ఈ కేసులో కీలక సూత్రధారిగా ఉన్న రిటైర్డ్ పోలీసు అధికారి రాధాకిషన్‌రావును సైతం విచారణకు పిలిపించిన సిట్ పోలీసులు కేటీఆర్‌తో కలిపి, ఆ తర్వాత విడిగా ప్రశ్నిస్తూ ఉన్నారు. సిరిసిల్లలో వార్ రూమ్ ఎందుకు ఏర్పాటైంది?.. దాని అవసరమేంటి?.. దాని ద్వారా సాధించిన ఫలితాలేంటి?.. వార్ రూమ్ కేంద్రంగా ట్యాపింగ్ అయిన ఫోన్లు ఎన్ని?.. అవి ఎవరివి?.. వాటిని ఎందుకు ఎంచుకున్నారు?.. ట్యాపింగ్ తర్వాత ఒనగూరిన ప్రయోజనమేంటి?.. ఇలాంటి పలు ప్రశ్నలతో కేటీఆర్ నుంచి సమాధానాలు రాబట్టినట్లు సమాచారం.
రాధాకిషన్‌రావుతో ‘కన్‌ఫ్రంటేషన్’ :
ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) ఇంతకాలం అధికారులను విచారించిన సిట్ పోలీసులు ఇటీవల రాజకీయ నాయకులను సైతం పిలిచి ప్రశ్నిస్తున్నారు. తొలుత హరీశ్‌రావును ఎంక్వయిరీ చేసిన పోలీసులు ఇప్పుడు కేటీఆర్ ను సైతం ఏడు గంటల పాటు విచారించారు. హరీశ్‌రావును ఒక్కడిగా మాత్రమే విచారిస్తే కేటీఆర్ ఎంక్వయిరీ మాత్రం రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ రాధాకిషన్‌రావుతో కలిపి విచారించారు. గతంలో ఆయన ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్న అంశాలపై సిట్ బృందం లోతుగా ప్రశ్నించింది. కేటీఆర్ ఇచ్చిన సమాధానాలను, రాధాకిషన్‌రావు ఇచ్చిన వివరాలను పోల్చి చూసే ప్రక్రియ మొదలైంది. ఇద్దరినీ కలిపి ‘కాన్ఫ్రంటేషన్’ పద్ధతిలో విచారించాలని సిట్ బృందం పకడ్బందీ వ్యూహం రచించడం వెనక స్పష్టమైన ప్రణాళిక ఉందన్నది పోలీసుల వాదన. కేటీఆర్ అనివార్యంగా సమాధానం ఇవ్వాల్సిన వాతావరణాన్ని ఈ ప్లాన్ సృష్టించిందని సమాచారం.
ఇజ్రాయిల్ సాఫ్ట్వేర్ పైనే ఫోకస్ :
సిరిసిల్ల వార్ రూమ్‌ను ఏర్పాటు చేయడంతో పాటు అందులో ఇజ్రాయిల్ నుంచి ప్రత్యేకంగా సాఫ్ట్ వేర్ తెప్పించడంపై సిట్ బృందం దృష్టి సారించింది. ఈ వ్యవహారంలో ప్రైవేటు టీవీ ఛానెల్ అధిపతి శ్రవణ్‌రావు రోల్పైనా కేటీఆర్ (KTR) నుంచి సిట్ బృందం ఆరా తీసినట్లు తెలిసింది. వ్యాపారవేత్తలను బెదిరించడానికే ఈ వార్ రూమ్‌ను ఏర్పాటు చేశారా?.. పార్టీకి విరాళాలు వచ్చేందుకే ఈ పనికి పాల్పడ్డారా?.. ఈ ఆపరేషన్‌లో గతంలో పాల్గొన్న రాధాకిషన్‌రావు ఇచ్చిన వివరాలను కేటీఆర్ ముందు ఉంచి సిట్ బృందం సమాధానాలను రాబట్టినట్లు తెలిసింది. కేటీఆర్‌ను ఒంటరిగా విచారించినప్పుడు సంధించిన ప్రశ్నలు, వచ్చిన సమాధానాలు, రాధాకిషన్‌రావు సమక్షంలో జరిగిన ఎంక్వయిరీ.. ఇదంతా పోలీసులకు కీలకమైన వివరాలు రాబట్టడానికి దారితీసినట్లు సమాచారం.
కేటీఆర్ ఎంక్వయిరీలో సిట్ ప్రశ్నలు ఇవే :
కేటీఆర్‌ను సిట్ బృందం ప్రశ్నించిన (KTR SIT Interrogation) తీరు బీఆర్ఎస్ వర్గాల్లోనే చర్చకు దారితీసింది. రాధాకిషన్‌రావుతో కలిపి విచారించడం వెనక ఉన్న ఉద్దేశంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సిట్ బృందం కేటీఆర్‌ను అడిగిన ప్రశ్నల్లో కొన్ని ఇలాంటివేనని పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. ఆ ప్రశ్నల్లో కొన్ని…
• బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన విరాళాలు ఎన్ని? 2023 ఎన్నికల సమయంలో వచ్చిన విరాళాల వివరాలు చెప్పండి?
• పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మీకు చెక్ పవర్ ఉంటుంది గదా.. ఆర్థిక వివరాలు మీకు తెలిసి ఉంటాయి… ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఎన్ని కోట్లు వచ్చాయి?
• సంధ్య కన్వెన్షన్ శ్రీధర్ రావు ద్వారా రూ. 12 కోట్ల మేర పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా విరాళాలు అందాయా? లేదా?
• ప్రభాకర్‌రావు బృందంతో బ్లాక్ మెయిల్ చేసి ఎలక్టోరల్ బాండ్స్ వసూలు చేశారా లేదా?
• సిరిసిల్లలో వార్ రూమ్ ఎందుకు ఏర్పాటు చేశారు? అక్కడ జరిగిన వ్యవహారాలు ఏంటి?
• సిరిసిల్ల వార్ రూమ్ కేంద్రంగానే రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఫార్మా వ్యాపారుల ఫోన్లు ట్యాపింగ్ అయింది నిజం కాదా?.. ఎందుకు చేశారు?
• ఫోన్ ట్యాపింగ్ కోసం ఇజ్రాయిల్ నుంచి తెప్పించిన సాఫ్ట్ వేర్ కోసం బీఆర్ఎస్ పార్టీ అకౌంట్ నుంచి డబ్బులు వెళ్లాయి కదా? ఎంత మొత్తంలో పేమెంట్ జరిగింది?.. మొత్తం ఈ వ్యవస్థకు పార్టీ ఖర్చు చేసిందెంత?
• మీకు ప్రైవేటు టీవీ ఛానల్ ఎండీ శ్రవణ్ రావుకు ఉన్న పరిచయం ఏంటి? ఛానల్ వార్ రూమ్‌లో ఏం జరిగింది?
• 2023 ఎన్నికల సమయంలో అప్పటి పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల ఫోన్స్ ట్యాపింగ్‌పై మీ సమాధానమేంటి?
• ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావుతో మీరు ఎన్నికల సమయంలో వాట్సాప్, సిగ్నల్ యాప్స్ ద్వారా అన్ని సార్లు ఎందుకు మాట్లాడారు?
• సినీ ప్రముఖులు, హీరోయిన్స్ ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేయించారు అనుకుంటున్నారు, దానిపై ఏమి చెప్తారు?
Read Also: జంపన్నవాగులో యువతుల గల్లంతు.. కాపాడిన ఎస్డీఆర్ఎఫ్
Follow Us On : WhatsApp


