కలం, వెబ్ డెస్క్ : కరీంనగర్ కార్పొరేషన్ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంటుందా? లేదా? అనే దానిపై రాష్ట్రమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) అన్నారు. ఈసారి బీజేపీకి మంచి వాతావరణం ఉందని, కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పదవిని కైవసం చేసుకోవడమే లక్ష్యమని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన నేతలు పెద్ద ఎత్తున బీజేపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. వారిని సాదరంగా ఆహ్వానించడంతోపాటు కలిసికట్టుగా పనిచేసి కార్పొరేషన్ పై కాషాయ జెండాను ఎగరేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
శుక్రవారం కరీంనగర్ లోని ఈఎన్ గార్డెన్స్ లో బీజేపీ నేతల సమావేశం జరిగింది. 24వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఒంటెల సత్యనారాయణరెడ్డి తన అనుచరులతో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. అలాగే 56వ డివిజన్ మాజీ కార్పొరేటర్ తాటి ప్రభావతి తన అనుచరులతో కలిసి సంజయ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు.
అనంతరం జరిగిన బీజేపీ ముఖ్య నాయకుల సమావేశానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, మాజీ అధ్యక్షులు బాస సత్యనారాయణ, మాజీ మేయర్లు సునీల్ రావు, డి.శంకర్, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లరమేశ్, సీనియర్ నేతలు ఓదేలు, వాసాల రమేశ్, రాజేంద్రప్రసాద్, డాక్టర్ పుల్లెల పవన్, బోయినిపల్లి ప్రవీణ్, గుజ్జ క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సదర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘బీజేపీలో పార్టీ నిర్ణయమే ఫైనల్. పార్టీ కంటే పెద్దోళ్లు ఎవరూ లేరు. ఎవరున్నా లేకున్నా పార్టీ కొనసాగుతుంది. గతంలో ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉండే. ఇప్పుడు వరుసగా మూడు సార్లు అధికారంలో కొనసాగుతోంది’ అని చెప్పారు.
‘కాంగ్రెస్ పార్టీ మూడు రాష్ట్రాలకే పరిమితమైంది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా కసితో పనిచేస్తున్న జిల్లాల్లో కరీంనగర్ అగ్రస్థానంలో ఉంది. ప్రజా సంగ్రామ యాత్ర సక్సెస్ లో కరీంనగర్ జిల్లా కార్యకర్తల భాగస్వామ్యం చాలా ఎక్కువ. కరీంనగర్ కార్యకర్తల సహకారంవల్లే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సక్సెస్ అయిన. ఈ నేపథ్యంలో కరీంనగర్ కార్పొరేషన్ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంటుందా? లేదా? అనే దానిపై రాష్ట్రమంతా ఎదురు చూస్తోంది’ అని బండి సంజయ్ (Bandi Sanjay) పేర్కొన్నారు.
కరీంనగర్ మేయర్ సీటును కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని, అందుకోసం దేనికైనా తెగించడానికి సిద్దపడదామని చెప్పారు. ఎన్నడూ లేనివిధంగా కార్పొరేషన్ ఎన్నికల్లో టిక్కెట్ల కోసం తాకిడి ఎక్కువగా ఉందని, ఒక్కో డివిజన్ కు 20 మందికిపైగా టిక్కెట్ ఆశిస్తున్నారని చెప్పారు. ‘వివిధ పార్టీలకు చెందిన నేతలు బీజేపీలోకి వచ్చినా వాళ్లకే టిక్కెట్లు గ్యారంటీగా ఇస్తామనే అవకాశమే లేదు. అంతిమంగా సర్వే నివేదికల ఆధారంగానే టిక్కెట్లు కేటాయింపు ఉంటుంది’ అని స్పష్టం చేశారు.
Read Also: జంపన్నవాగులో యువతుల గల్లంతు.. కాపాడిన ఎస్డీఆర్ఎఫ్
Follow Us On: Sharechat


