కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తన వ్యక్తిత్వ హననం చేస్తున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు సొంత చెల్లెలు ఫోన్ ట్యాపింగ్ చేయించినప్పుడు కేటీఆర్ ఇవన్నీ మర్చిపోయారా? అంటూ ఫైర్ అయ్యారు. శుక్రవారం మహేశ్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజ్యాంగం ప్రకారమే విచారణ జరుగుతోందని స్పష్టం చేశారు. రాజకీయ కక్ష సాధింపు ధోరణి ఉంటే అధికారంలోకి వచ్చిన వెంటనే చర్యలు ఉండేవని ఆయన తెలిపారు.
అయితే అలా కాకుండా చట్టబద్ధంగా దర్యాప్తు జరుగుతోందని మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) పేర్కొన్నారు. అందుకే ఇంతకాలం తర్వాత కేటీఆర్ ను అధికారులు విచారిస్తున్నారని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో కేటీఆర్ ముందుగా ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణలను వినడం వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడమేనని మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. ఈ అంశంలో కేటీఆర్ మాట్లాడుతున్న తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.
బట్ట కాల్చి మీద వేసి పారిపోతామంటే కుదరదని హెచ్చరించారు. అలీబాబా 420 దొంగల మాదిరిగా కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుందని తీవ్ర ఆరోపణలు చేశారు. తోడబుట్టిన చెల్లెలు కవిత ఫోన్ ట్యాపింగ్ జరిగిందని గగ్గోలు పెడుతుంటే, దానిపై సమాధానం ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ వంటి తీవ్రమైన అంశంపై రాజకీయ ఆరోపణలు కాకుండా నిజాలు బయటకు రావాల్సిన అవసరం ఉందని మహేష్‌కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. కవితను చెల్లెలుగా ఎప్పుడూ గౌరవిస్తానని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. కేసీఆర్ కుటుంబంలో తగాదాలకు మూలం వాటాల పంపకంలో తేడా రావడమేనని వ్యాఖ్యానించారు. కవిత ఇప్పటికైన నిజాలు మాట్లాడుతున్నాందుకు స్వాగతిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ హయాంలో కేవలం మూడు నెలల్లో 547 ఫోన్లు ట్యాప్ అయ్యాయని ఆరోపించారు. తన మిత్రుడి ఫోన్ సైతం ట్యాప్ అయ్యిందని ఆరోపించారు. ఏఐసీసీ ఇంచార్జీ మార్పు అంటూ వస్తున్న వార్తలను కొట్టిపారేశారు.


