epaper
Thursday, January 22, 2026
spot_img
epaper

తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్‌కు అపూర్వ స్పందన

కలం, వెబ్ డెస్క్: దావోస్‌ (Davos)లో‌ జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం–2026 సమావేశాల్లో తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్ (TAIH)కు అంతర్జాతీయ స్థాయిలో అపూర్వ స్పందన లభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్’ బృందం పలు ప్రతిష్ఠాత్మక సంస్థలతో అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) కుదుర్చుకుంది. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ విద్యా, పబ్లిషింగ్ సంస్థ పియర్సన్ తెలంగాణ ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా తెలంగాణలో ఏర్పాటు కానున్న గ్లోబల్ ఏఐ అకాడమీకి పియర్సన్ సహకారం అందించనుంది. ఏఐ శిక్షణ, పాఠ్య ప్రణాళిక, లెర్నింగ్ కంటెంట్, అంచనా విధానాలు, అంతర్జాతీయ స్థాయి సర్టిఫికేషన్లలో తన నైపుణ్యాన్ని పియర్సన్ ఉపయోగించనుంది.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మాట్లాడుతూ.. యువతకు ఏఐ శిక్షణ అందించి భవిష్యత్ తరాలకు నైపుణ్యం కలిగిన రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. ఎంఓయూ కుదుర్చుకున్న బృందాన్ని ఆయన అభినందించారు. ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ఏఐ సిటీ నిర్మాణానికి అవసరమైన పూర్తి స్థాయి ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేస్తామని చెప్పారు. తెలంగాణలో ఇప్పటికే అన్ని ప్రముఖ టెక్ కంపెనీలు ఉన్నాయని, ప్రతిభ, మౌలిక సదుపాయాలు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు.

ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఐటీ, పరిశ్రమలు) సంజయ్ కుమార్ మాట్లాడుతూ, పియర్సన్‌తో కలిసి ఉన్నత నైపుణ్యాల కలిగిన మానవ వనరుల అభివృద్ధి దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ప్రాజెక్టు త్వరితగతిన అమలుకు అవసరమైన అనుమతులు ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. జార్జ్‌టౌన్ యూనివర్సిటీకి చెందిన ఏఐ కోల్యాబ్ సంస్థతో కూడా తెలంగాణ ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా ఆరోగ్య రంగంలో ఏఐ ఆధారిత పరిశోధనలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆరోగ్య సంరక్షణ, ప్రజారోగ్యం, లైఫ్ సైన్సెస్ రంగాల్లో అనువర్తిత పరిశోధనలకు ఇది దోహదపడనుంది. అలాగే దుబాయ్ మల్టీ కమోడిటీస్ సెంటర్ (DMCC)తో కుదిరిన ఎంఓయూ ద్వారా స్టార్టప్‌ల అభివృద్ధికి అవకాశాలు అన్వేషించనున్నారు. రెండు దేశాల మార్కెట్లు, ఎకోసిస్టమ్‌లపై అవగాహన కల్పించడంతో పాటు, అంతర్జాతీయ సదస్సులు, కార్యక్రమాలు నిర్వహించే అంశాన్ని కూడా పరిశీలించనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>